ఆదివారం సాయంత్రం ముంబైలో జరిగిన అద్భుతమైన వేడుకలో దివితా రాయ్ లివా మిస్ దివా యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఈవెంట్‌లో మెరూన్ గౌనులో అందంగా కనిపించిన 23 ఏళ్ల దివితా రాయ్‌కు 2021 మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు కిరీటాన్ని బహుకరించారు. 71వ మిస్ యూనివర్స్ 2022 పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్న దివితా ముంబైకి చెందినది కాగా.. ఆమె కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది. దివిత వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్ మరియు మోడలింగ్ కూడా చేసింది. ఆమె ముంబైలోని సర్ JJ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో చదువుకుంది.అదే సమయంలో మోడలింగ్‌పై తన అభిరుచిని కొనసాగించింది.
ఆమెకు బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్‌బాల్ ఆడటం, సంగీతం వినడం మరియు చదవడం కూడా చాలా ఇష్టం. 2021లో జరిగిన మిస్ దివా యూనివర్స్ పోటీలో దివితా కూడా పాల్గొందని చాలామందికి తెలియదు. గత సంవత్సరం 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో హర్నాజ్ కిరీటాన్ని గెలుచుకుంది. దివితా గత సంవత్సరం పోటీలో మిస్ దివా 2వ రన్నరప్‌గా నిలిచింది. అయితే.. ఇప్పుడు దివితా.. ఈ సంవత్సరం కూడా పాల్గొని టైటిల్‌ను గెలుచుకుంది.