New Movie: ”స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి” లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు కె. విజయభాస్కర్ కాస్తంత విరామం తర్వాత తిరిగి మెగాఫోన్ చేతపట్టారు. ఆయన దర్శకత్వంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ఆర్కే బ్యానర్ పై ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకట శ్రీనివాస్ బొగ్గరం దీనిని సమర్పిస్తున్నారు. విజయభాస్కర్ తనయుడు శ్రీకమల్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ కథానాయికగా నటించబోతోంది. ఈ చిత్రానికి ‘జిలేబి’ అనే ఇంటరెస్టింగ్ టైటిల్ ని ఖరారు చేశారు. విజయదశమిని పురస్కరించుకొని ఈ చిత్ర ప్రారంభోత్సవం చలన చిత్ర ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. నిర్మాత స్రవంతి రవి కిషోర్ స్క్రిప్ట్ అందించగా, డాక్టర్ రాజశేఖర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ ఇవ్వగా, తొలి సన్నివేశానికి బి గోపాల్ దర్శకత్వం వహించారు.
Energetic Star Ram: యాక్షన్ ఎపిసోడ్‌తో బోయపాటి, రామ్ సినిమా షూటింగ్ ఆరంభం
ఈ సందర్భంగా దర్శకుడు కె. విజయ భాస్కర్ మాట్లాడుతూ, ”చాలా విరామం తర్వాత మళ్ళీ దర్శకత్వం చేయడం ఆనందంగా వుంది. రామకృష్ణ, శ్రీనివాస్ గారితో కలసి సినిమా చేయడం చాలా సంతోషంగా వుంది. త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తాం” అన్నారు. శివాని రాజశేఖర్ మాట్లాడుతూ, ”విజయ భాస్కర్ గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలో హీరోయిన్ గా నటించడం ఆనందంగా వుంది. కమల్ నాకు మంచి స్నేహితుడు. మేమిద్దరం కలసి పని చేయడం హ్యాపీగా అనిపిస్తోంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు” అని తెలిపారు. శ్రీకమల్ మాట్లాడుతూ, ”మీ అందరికీ వినోదం పంచడానికి ప్రయత్నిస్తాను. మీ ఆశీస్సులు కావాలి” అని కోరారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫర్ గా, ఎం.ఆర్. వర్మ ఎడిటర్ గా పని చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, గెటప్ శ్రీను, గుండు సుదర్శన్, బిత్తిరి సత్తి ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
