మంచి సబ్జెక్ట్ దొరకలాలే కానీ, తకధిమితై ఆడించేస్తా అంటూ సరదాగా సాగుతుంటారు దర్శకుడు హరీశ్ శంకర్. ఆయన పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ‘గబ్బర్ సింగ్’. ఆ సినిమాతో సక్సెస్ ట్రాక్ పైకి ఎక్కిన హరీశ్ శంకర్, తనకు అచ్చివచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మరో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మొదట్లో ‘భవదీయుడు… భగత్ సింగ్’ అనే టైటిల్ అనుకున్నారు. తరువాత ‘భవదీయుడు’ స్థానంలో ‘ఉస్తాద్’ అని చేరింది. ఇప్పుడు పవన్ తో ‘ఉస్తాద్…భగత్ సింగ్’ తీస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో హరీశ్ బంపర్ హిట్ కొట్టారు కాబట్టి, ‘ఉస్తాద్…భగత్ సింగ్’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
హరీశ్ శంకర్ 1979 మార్చి 31న జగిత్యాల సమీపంలోని ధర్మపురిలో జన్మించారు. చిన్నప్పటి నుంచీ చదువులో చురుకైన హరీశ్ కు సినిమాలంటే ఆసక్తి ఉండేది. ఎలాగైనా సరే వైవిధ్యంగా అలరించాలనీ తపించేవారు. చదువుకొనే రోజుల నుంచే నటనపై ఆసక్తి పెంచుకొని నాటకరంగంతో కొద్ది రోజులు సరదాగా సాగారు హరీశ్. నటించారు, నాటకాలు రచించారు, వాటికి దర్శకత్వం వహించారు. ఆ సరదాతోనే సినిమా రంగంవైపు పరుగు తీశారు. రచనలో చేయి చేసుకున్నారు, నటనలో కాలు పెట్టారు. చివరకు మెగాఫోన్ పట్టి అందరికీ ‘షాక్’ ఇచ్చారు. ఈ ప్రయాణంలో రచయిత కోన వెంకట్, దర్శకులు పూరి జగన్నాథ్, రామ్ గోపాల్ వర్మ వంటివారు హరీశ్ కు సహాయసహకారాలు అందించారు. రవితేజ హీరోగా రామ్ గోపాల్ వర్మ నిర్మించిన ‘షాక్’తోనే హరీశ్ డైరెక్టర్ అయ్యారు.
తొలి సినిమా ‘షాక్’ నిజంగానే పలువురికి షాక్ ఇచ్చింది. కానీ, రవితేజకు హరీశ్ పై నమ్మకాన్ని పెంచింది. దాంతో రవితేజ మరో అవకాశం ఇచ్చారు. అదే ‘మిరపకాయ్’. ఇందులోని ఘాటు కొందరికి ఎక్కింది. హరీశ్ లో విషయం ఉందని అర్థమయింది. హిందీలో ఘనవిజయం సాధించిన సల్మాన్ ఖాన్ ‘దబంగ్’ ఆధారంగా తెలుగులో హరీశ్ శంకర్ సినిమా తీయాలని ఆశించారు. అదే సమయంలో ఆ చిత్రంపై దృష్టి నిలిపిన పవన్ కళ్యాణ్, హరీశ్ నే పిలిపించి, అవకాశం అందించారు. ఈ సినిమాలో శ్రుతి హాసన్ ను నాయికగా ఎంచుకున్నారు హరీశ్ శంకర్. చిత్రమేంటంటే, అదే సమయంలో పవన్ సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే ఆ చిత్ర నిర్మాత బండ్ల గణేశ్ కూడా తగిన విజయం కోసం ఆశగా ఉన్నారు. ఇక శ్రుతి హాసన్ విషయానికి వస్తే, అప్పటికే ఆమె పలు ఫ్లాపులు చూసి ‘ఐరన్ లెగ్’ ముద్ర వేయించుకుంది. పోనీ, హరీశ్ కు ఏమైనా సూపర్ డూపర్ హిట్ ఉందా అంటే అదీ లేదు. ఇన్ని మైనస్ లు కలసి రూపొందిన ‘గబ్బర్ సింగ్’ ప్లస్ టు ది పవరాఫ్ ప్లస్ గా మారి అనూహ్య విజయం సాధించింది. పవన్ కోరుకున్న గ్రాండ్ సక్సెస్ చిక్కింది. బండ్ల గణేశ్ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా నిలిచారు. బంపర్ హిట్ ఆశించిన హరీశ్ శంకర్ కోరిక తీరింది. అన్నిటినీ మించి శ్రుతిహాసన్ కు ఐరన్ లెగ్ ముద్ర చెరిగిపోయింది. ఈ సక్సెస్ తరువాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో నటించాలని యంగ్ హీరోస్ పరుగులు తీశారు.
‘గబ్బర్ సింగ్’ తరువాత యంగ్ టైగర్ యన్టీఆర్ తో ‘రామయ్యా వస్తావయ్యా’ తెరకెక్కించారు హరీశ్. ఆ సినిమా అంతగా అలరించలేకపోయింది. హరీశ్ పనైపోయిందనుకున్నారు. రెండేళ్ళ తరువాత సాయధరమ్ తేజ్ హీరోగా ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ తీసి మెప్పించారు. మెగా కాంపౌండ్ ను ఒప్పించారు. దాంతో అల్లు అర్జున్ హీరోగా ‘దువ్వాడ జగన్నాథమ్’ తీసే ఛాన్స్ దక్కించుకున్నారు హరీశ్. ఈ సినిమా విడుదలకు ముందే కొన్ని వివాదాలకు తెరలేపింది. విడుదలయ్యాక కుర్రకారును కిర్రెక్కించింది. మరి రెండేళ్ళ తరువాత మరో మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ తో ‘గద్దలకొండ గణేశ్’ తీసి ఆకట్టుకున్నారు హరీశ్. ఆ సినిమా తరువాత ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ తో సినిమా ఛాన్స్ పట్టేశారు హరీశ్. మరోసారి పవన్ తో కలసి పనిచేస్తున్న హరీశ్ ఈ సారి తెరకెక్కించే ‘ఉస్తాద్…భగత్ సింగ్’తో ఏ స్థాయి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటారో చూడాలి.