Different Weather: తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత, వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏపీలో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. అయితే నిన్న కొన్ని జిల్లాల్లో వర్షం కురియడంతో జనం కాస్త సేద దీరారు. నెల్లూరు, ప్రకాశం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో సాయంత్రం వరకు ఎండ దంచి కొట్టగా… తర్వాత చిరు జల్లులు కురిశాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఈదురు గాలుల వాన భీబత్సం సృష్టించింది. గాలుల తీవ్రతకు ఆత్మకూరులో పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
ప్రకాశంజిల్లా పుల్లలచెరువు మండలంలో హోరు గాలి, భారీ వర్షానికి రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కడప, అన్నమయ్య జిల్లాల్లోనూ చిరు జల్లులు పడ్డాయి. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఏజెన్సీలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఉక్కిరిబిక్కిరైన ఏజెన్సీవాసులు…వానతో సేదదీరారు. అయితే గాలుల ఉధృతికి హోర్డింగ్‌లు పడిపోయాయి. కురుపాం ఏజెన్సీలో విద్యుత్ సరఫరా కొంతసేపు నిలిచిపోయింది. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతిచెందాడు. మరోవైపు ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాలకు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే… సాయంత్రం వేళ అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నా… అంతవరకు భానుడు ఠారెత్తిస్తున్నాడు. దీంతో వడదెబ్బకు చనిపోయేవారి సంఖ్య అంతకంతకూ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వృద్ధులు, ఆనారోగ్య సమస్యలు ఉన్నవారు బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు వైద్యులు.