Site icon NTV Telugu

Off The Record: ఒకే ఒక్క స్కూల్.. ఆ ఇద్దరు నేతల మధ్య అగ్గి పెట్టిందా?

Congress Vs Bjp

Congress Vs Bjp

ఒక్క స్కూల్… ఒకే ఒక్క స్కూల్ ఆ ఇద్దరు నేతల మధ్య అగ్గి పెట్టిందా? నేను చెప్పిన చోటే ఏర్పాటు చేయాలంటే…. కాదు నేను చెప్పిన చోటే కావాలంటూ… ఒకరు స్టేట్ లెవెల్ లో ఇంకొకరు సెంట్రల్ లెవెల్ లో పైరవీలు చేస్తున్నారా..? అసలా బడితో… ఇద్దరు నేతలకు వచ్చే ప్రయోజనం ఏంటి..? ఎక్కడుందా స్కూల్‌..? సమరానికి సై అంటున్న నేతలు ఎవరు..?

నవోదయ విద్యాలయం. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో 1986లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వ్యవస్థ. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఓ నవోదయ విద్యాలయం ఉండాలన్నది టార్గెట్‌. ఈ క్రమంలోనే… జిల్లాల పునర్విభజన తర్వాత నిరుడు తెలంగాణకు కొత్తగా ఏడు విద్యాలయాలు మంజూరయ్యాయి. అందులో ఒకటి సంగారెడ్డి జిల్లాకు వచ్చింది. కానీ… ఇప్పుడీ స్కూల్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య క్రెడిట్‌ వార్‌ మొదలైందట. జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు మధ్య పొలిటికల్‌ గేమ్‌ నడుస్తున్నట్టు సమాచారం. తన నియోజకవర్గం అయిన అందోల్‌లో నవోదయ విద్యాలయను ఏర్పాటు చేయించాలని మంత్రి దామోదర చూస్తుంటే….. ఎంపీ రఘునందన్ మాత్రం తన పార్లమెంట్ పరిధిలోని పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్ పూర్‌కు తీసుకువెళ్ళాలన్న ఆలోచనలో ఉన్నారట.నవోదయ స్కూల్ అలా మంజూరు అయ్యిందో లేదో .. ఇలా అందోల్ నియోజకవర్గం మునిపల్లిలో స్థల పరిశీలన చేసేశారు మంత్రి దామోదర. కానీ… అక్కడ కావాల్సినంత స్థలం లేకపోవడం… అలాగే జోగిపేట ఇప్పటికే వివిధ విద్యాసంస్థలతో ఎడ్యుకేషన్ హబ్‌గా ఉండటంతో నవోదయ స్కూల్‌ని కూడా అందోల్‌లోనే పెడితే బాగుంటుందని అనుకున్నారట ఆయన. ఇందుకోసం అందోలు శివారులో 25 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కూడా ఎంపిక చేసేశారు. దాన్ని నవోదయ విద్యాసమితి కూడా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇక ఇదే విద్యాలయం కోసం మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు కూడా రేస్‌లోకి రావడంతో స్కూల్‌కు ఫుల్‌గా పొలిటికల్‌ కలర్‌ వచ్చేసింది. తనవంతుగా హైదరాబాద్‌ శివారు, పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్ పూర్‌లో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారట ఎంపీ. అధికారులకు కూడా స్కూల్ ఏర్పాటుపై పలు సూచనలు చేసినట్టు తెలిసింది. ఇలా… మంత్రి, ఎంపీ ఎవరికి వారు నవోదయ స్కూల్ కోసం స్థలం ఎంపిక చేసేసి ఎవరి ప్రయత్నాల్లో వారు ఉండటంతో… ఉత్కంఠ పెరుగుతోంది.

జిల్లాలో ఎక్కడ పెడితే ఏముంది? పిల్లలకు మంచి చదువులు దక్కడం ముఖ్యంగానీ… అంటూ వీళ్ళ వ్యవహారశైలి మీద విమర్శలు పెరుగుతున్నాయి. ఇద్దరి తాపత్రయం క్రెడిట్‌ కోసం తప్ప… త్వరగా పని పూర్తి చేసి పిల్లలలకు మేలు చేద్దామన్న ఉద్దేశ్యం కనపించడం లేదన్న అభిప్రాయం బలపడుతోంది. రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం, జిల్లా నుంచి మంత్రి దామోదర రాజనర్సింహ ఉండటంతో అందోల్‌లో నవోదయ స్కూల్ ఏర్పాటు చేయించి ఆ క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారన్నది ఆయన ప్రత్యర్థుల అభియోగం. అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గానికి తాను ఏం చేశానో చెప్పడానికి నవోదయ స్కూల్‌ మంచి ల్యాండ్‌మార్క్‌ అవుతుందన్నది ఆయన లెక్కగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఆందోల్ లో JNTU, మహిళా పాలిటెక్నిక్ కాలేజీ, మహిళా అగ్రికల్చర్ కాలేజీలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యంగ్ ఇండియా స్కూల్ తో పాటు నర్సింగ్‌ కాలేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఇవన్నీ కూడా మంత్రి దామోదర హయాంలోనే రావడంతో నవోదయ స్కూల్ క్రెడిట్ కూడా తన ఖాతాలోనే వేసుకోవాలని తహతహలాడుతున్నారట ఆయన. ఇక ఎంపీ రఘునందన్ రావు లెక్కలు మరోలా ఉన్నాయంటున్నారు.

కచ్చితంగా సంగారెడ్డి జిల్లాకి మంజూరైన నవోదయ స్కూల్ ని తాను అనుకున్న చోటే ఏర్పాటు చేయించాలని ఆయన పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్రంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో ఆయన ఢిల్లీలో తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. తాను అనుకున్న స్థలంలో నవోదయ స్కూల్‌ ఏర్పాటు చేయించగలిగితే…. దాన్ని ఎంపీగా తన ఖాతాలో వేసుకోవచ్చనేది రఘునందన్‌ ఆలోచన అట. పొలిటికల్‌గా వీళ్ళిద్దరి క్రెడిట్‌ వార్‌ ఇలా ఉంటే…. మరో వైపు వచ్చే విద్యా సంవత్సరం నుంచి నవోదయ తరగతులు ప్రారంభించాలని విద్యాశాఖ యోచిస్తోందట. అందుకు జోగిపేట ప్రభుత్వ పాఠశాల భవనాన్ని కూడా పరిశీలించారు అధికారులు. ఇద్దరూ పట్టుదలగా ఉండటంతో ఫైనల్‌గా ఎవరి పంతం నెగ్గుతుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది స్థానికంగా. జిల్లా ప్రజలు మాత్రం రాజకీయాల కోసం కాకుండా నవోదయ విద్యాలయాన్ని విద్యార్థులకు అందుబాటులో ఉండే స్థలంలో ఏర్పాటు చేసి త్వరగా అందుబాటులోకి తీసుకువస్తే అదే చాలని కోరుకుంటున్నారు. అందోల్‌ వర్సెస్‌ అమీన్‌పూర్‌ వార్‌లో చివరికి స్కూల్‌ ఎటు మొగ్గుతుందో చూడాలి.

Exit mobile version