Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..

Dhruv Rathee

Dhruv Rathee

Dhruv Rathee: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలో పాల్గొనేందుకు ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఢిల్లీకి వచ్చారు. అయితే, గురుగ్రామ్ సెక్రటరీ 56లోని సెంట్రల్ పార్క్ విహార్‌లో ఉన్న ఆయన కుటుంబ నివాసంలోకి శుక్రవారం అర్ధరాత్రి నుంచే సుమారు 50 మంది పోలీసులు మోహరించారు. చివరకు శనివారం ఉదయం 7:48 గంటలకు రాఠీ తల్లి తలుపు తీయడంతో పోలీసులు లోపలికి వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ నిరసనను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో దాదాపు లాక్‌డౌన్ లాంటి పరిస్థితులు సృష్టించిందని ధ్రువ్ రాఠీ ముందుగానే మండిపడ్డారు.

ఈ మేరకు ఆయన శుక్రవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. మా ఆందోళనను అడ్డుకోవడానికి ఏకంగా 50కి పైగా మెట్రో స్టేషన్లను మూసివేశారని, రైళ్లు, బస్సులను రద్దు చేశారని, ఢిల్లీని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. మా ప్రొటెస్ట్‌కి ఎవరూ రారని మీ ఐటీ సెల్లే చెబుతోంది కదా, మరి అంత భయమెందుకు? జనం రారన్నప్పుడు ఇన్ని ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. మీరు నిజంగానే భయపడుతున్నారని, దేశ ప్రజలంతా ఇప్పుడు మేల్కొన్నారని పేర్కొంటూ.. ప్రజలందరూ అక్టోబర్ 10న జంతర్ మంతర్ నిరసనకు తరలిరావాలని ఆ వీడియోలో పిలుపునిచ్చారు.

మరోవైపు, ఈ నిరసనను అణచివేయడానికి ఢిల్లీ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కీలకమైన మెట్రో స్టేషన్లతో పాటు మార్కెట్లను కూడా మూసివేశారు. ఢిల్లీకి వచ్చే డజన్ల కొద్దీ రైళ్లను రద్దు చేయడంతో పాటు, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. అంతేకాకుండా, నిరసనకారులు ఎవరూ ఢిల్లీకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ఇటువంటి కట్టుదిట్టమైన భద్రతా వలయాల మధ్యే ధ్రువ్ రాఠీని పోలీసులు అరెస్ట్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది.