NTV Telugu Site icon

Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తాం..

Revanth

Revanth

Revanth Reddy: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతవరణం వేడెక్కుతోంది. ఇప్పటికే అధికార పార్టీ తమ వ్యూహాలకు పదునుపెట్టగా.. ప్రతిపక్షాలు తమదైన శైలిలోకి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల విజయం తర్వాత మంచి జోష్‌ మీదున్న కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కుంచుకోవాలని పావులు కదుపుతోంది. ఇప్పటికే పాదయాత్రలు, బహిరంగసభల పేరుతో జనంలోకి వెళ్తోంది. తాజాగా హైదరాబాద్‌ సోమాజిగూడలోని కత్రియా హోటల్‌లో జరిగిన యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశంలో రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. బీజేపీ కుట్రలను ఛేదించి దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే తాము అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని రేవంత్​ పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం యూత్ కాంగ్రెస్ నేతలంతా కష్టపడాలన్నారు.

Read Also: Revanth Reddy: సెప్టెంబర్ 17న కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో.. కార్యకర్తలకు కీలక పిలుపు

ధరణి పోర్టల్ గడీల పాలన కోసం తెచ్చారని ఆయన ఆరోపించారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసింది భూమి కోసమేనని.. ఆ భూముల మీద దొరల పెత్తనం ఆగకపోతే నక్సల్ బరి ఉద్యమం వచ్చిందని రేవంత్ చెప్పారు. పట్టణ బాట పట్టిన దొరల కోసం ధరణి కేసీఆర్‌ ధరణి తెచ్చారని రేవంత్ విమర్శలు గుప్పించారు. కొత్త భూస్వాములను తయారుచేసేందుకే.. ధరణి. రూ.వందల కోట్లు కొల్లగొట్టేందుకే ధరణి పోర్టల్ తెచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధరణి పోర్టల్‌ నిర్వహణ ప్రభుత్వం చేతుల్లో లేదని ఆయన విమర్శించారు. ధరణి పోర్టల్‌ నిర్వహణ దళారుల చేతుల్లో ఉందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని రేవంత్ ఈ సందర్భంగా ప్రకటించారు. ధరణి ద్వారా హైదరాబాద్‌ చుట్టూ భూములు దోచుకున్నారని ఆయన ఆరోపణలు చేశారు. దోచుకున్న భూములను బినామీ పేర్లపై ఉంచారని రేవంత్ అన్నారు. దేశాన్ని దోచుకోవడమే డబుల్ ఇంజిన్ పని అంటూ రేవంత్ మండిపడ్డారు. వన్ నేషన్.. వన్ పార్టీ అనేది బీజేపీ రహస్య ఎజెండా అని విమర్శించారు. సెప్టెంబర్ 17 న కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం పార్టీ కార్యకర్తలంతా కలసికట్టుగా కష్టపడాలని రేవంత్‌ సూచించారు.

Read Also: Gangula Kamalakar: కాంగ్రెస్, బీజేపీని గెలిపిస్తే కాళేశ్వరాన్ని బద్దలుకొట్టి నీళ్లు ఎత్తుకుపోతారు..

ధరణి పోర్టల్ వెనుక గూడు పుటాని ఏందో తేలాలని రేవంత్ అన్నారు. ధరణి రద్దు అయితే… రైతు బంధు రాదని కేటీఆర్, కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు. ధరణి రద్దు చేస్తాం అంటే..కేసీఆర్‌కు ఎందుకు దుఃఖం వస్తోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్సే లేదన్న వాళ్లు ఇప్పుడు ఎందుకు తిడుతున్నారని రేవంత్ ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తున్నారని వారి అర్థమైందని.. అందుకే కాంగ్రెస్‌ను అడ్డుకోవడానికి చిల్లర మాటలు చెప్తున్నారని రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ రద్దు అయిన 500 నోటు లాంటి వారని.. మోడీ రద్దు కాబోతున్న 2 వేల నోటు లాంటి వారని రేవంత్ అన్నారు. ఐదు అంశాలతో జనంలోకి వెళ్తామని ఆయన చెప్పారు. తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయని రేవంత్ స్పష్టం చేశారు.

Show comments