ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. క్వశ్చన్ అవర్‌తో అసెంబ్లీ ప్రారంభమైంది. నెల్లూరు జిల్లాలో నీటి సమస్య, పశు వైద్య కళాశాలపై క్వశ్చన్ అవర్‌లో చర్చ జరిగింది. అయితే అసెంబ్లీలో కొంతమంది సభ్యులు ఫోన్ మాట్లాడుతుండడంను డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు గమించారు. అత్యవసర పరిస్థితి అయితే ఫోన్ బయటకు వెళ్లి మాట్లాడాలని, ఫోన్‌ను సభ్యులు సైలెంట్‌లో పెట్టుకోవాలని సూచించారు. ఇది విజ్ఞప్తి అని, విజ్ఞప్తులు ఒకటి రెండు సార్లు మాత్రమే ఉంటాయని డిప్యూటీ స్పీకర్ హెచ్చరించారు. అసెంబ్లీలో జామర్లు పెట్టాలని సభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు అనగా.. మన బలహీనత జామర్లపైకి నెట్టొద్దని డిప్యూటీ స్పీకర్ సమాధానం ఇచ్చారు.
అసెంబ్లీలో పీహెచ్‌సీలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. పీహెచ్‌సీల నిర్మాణంపై దృష్టి పెట్టామని, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా పీహెచ్‌సీల ఆధునికీకరణ జరుగుతుందన్నారు. వెంటనే ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో సరైన సౌకర్యాలు లేవని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గత ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించి కనీస సౌకర్యాలు కూడా కిడ్నీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ఏర్పాటు చేయలేదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ విషయంలో మంత్రి సత్యకుమార్ దృష్టి పెట్టాలని కోరారు. గత ప్రభుత్వంలో రైతులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్నారన్న సభ్యులు తెలిపారు. వ్యవసాయంలో ఎలాంటి ఆధునిక చర్యలు తీసుకుంటారనే అంశంపై సభ్యులు ప్రశ్నలు అడిగారు.