Deputy CM Narayana Swamy: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎప్పుడూ ఏదో విషయంలో సంచలన కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు.. ఎన్నికల సమయంలో టికెట్ల కోసం కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి అంటూ ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చిత్తూరు జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. టికెట్ ఇచ్చేటప్పుడు సీఎం వైఎస్ జగన్ జాగ్రత్తగా ఇవ్వాలని సూచించారు. టీడీపీ నుండి వచ్చే పనికిరాని వాళ్లకి టికెట్ ఇస్తున్నారు.. టీడీపీ నుండి వస్తున్న వారి క్యారెక్టర్ చూసి టికెట్ ఇవ్వాలన్నారు.. అలా కాకుండా ఇస్తే.. గతంలో 23 మంది ఎమ్మెల్యేలు అందుకే పార్టీ వదిలివెళ్లారన్నారు.
Read Also: OTT Release Movies: సంక్రాంతి కానుకగా ఈ వారం ఓటీటీలో 29 సినిమాలు రిలీజ్.. ఏ సినిమా ఎక్కడంటే?
ఇక, ఎస్సీ నియోజకవర్గాల్లో టీడీపీ నుండి కోవర్టులుగా వచ్చి టికెట్ అడుగుతున్నారని మండిపడ్డారు నారాయణస్వామి.. జాగ్రత్తగా ఉండాలి లేదంటే వాళ్లు సీఎం వైఎస్ జగన్ ను ముంచేస్తారని హెచ్చరించారు. మరోవైపుమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్లు పట్టుకున్నానని విమర్శలు చేస్తారా..? టికెట్ రికమెండేషన్ కోసం ఎవరో ఒకరి కాళ్లు పట్టుకోవాలి కదా? అని ప్రశ్నించారు. ఎస్సీలం మేం ఏమి చేయాలి ఇంకా..? నేను కూడా టికెట్ కోసం వైఎస్ జగన్ కాళ్లు పట్టుకున్నాను అని పేర్కొన్నారు. అయితే, తనకు సపోర్టుగా ఉండాలని ఉద్దేశంతో అడుకుంటామని.. రాజకీయాల్లో ఇవే సర్వసాధారణమైన వ్యవహారంగా చెప్పుకొచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. కాగా, ఏపీలో ఎన్నికల సమయంలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు, చేర్పులు కాకరేపుతోన్న విషయం విదితమే.. ఇప్పటికే రెండు దఫాలుగా కీలక మార్పుకు సంబంధించిన జాబితా విడుదల కాగా.. ఇప్పుడే మూడో జాబితాపై వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తోన్న విషయం తెలిసిందే.