NTV Telugu Site icon

Bhatti Vikramarka: ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలి.. శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న డిప్యూటీ సీఎం

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Deputy CM Bhatti Vikramarka: ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, శ్రీశైల మల్లికార్జున, భ్రమరాంబిక అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. సోమవారం ఆయన కుటుంబ సభ్యులతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్, మేఘా రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎన్నం శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి శ్రీశైల మల్లికార్జున దర్శనం చేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇరు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి, ఋతుపవనాలు బలంగా వీచాలని, పంటలు సమృద్ధిగా పండాలని ఆ దేవుడిని ప్రార్థించానని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క తెలిపారు.

Read Also: GST: జీఎస్టీ అమలు తర్వాత ఏ వస్తువులు చౌకగా మారాయి?

కరువు కాటకాలు అనేవి లేకుండా అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. ఋతుపవనాలు రాకముందే శ్రీశైలం హైడల్ ప్రాజెక్టును సమీక్షించి తద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన చర్యలు చేపట్టడమే తన పర్యటన ఉద్దేశమన్నారు. నాటి కాంగ్రెస్ పెద్దలు ముందుచూపుతో నిర్మించిన బహుళార్థక సార్ధక ప్రాజెక్టుతో మన జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. అమర జీవులకు నివాళులు అర్పిస్తున్నామన్నారు. శ్రీశైలం హైడల్ ప్రాజెక్టు ద్వారా అత్యధిక స్థాయిలో విద్యుత్తు ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవు, 2029-30 వరకు కావలసిన విద్యుత్తు తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో ఉందని ఆయన తెలిపారు.