గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరామర్శించారు. తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి గురించి ఏఐజీ ఆసుపత్రి వైద్యులను డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. తమ్మినేని త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా క్షేత్రంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. తమ్మినేని గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం వెంట మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ కమిటీ కో కన్వీనర్ అజ్మతుల్లా తదితరులు ఉన్నారు.
Also Read: Free Bus For Women: మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణంపై హైకోర్టులో పిల్!
ఖమ్మం జిల్లాలోని తెల్దారుపల్లిలో ఉన్న తమ్మినేనికి సోమవారం సాయంత్రం ఒంట్లో నలతగా ఉండటంతో.. కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆయనకు పల్స్ తక్కువగా ఉండటాన్ని గుర్తించి చికిత్స అందించారు. అయితే గుండె కొట్టుకోవడంలో తేడా ఉండడంతో.. వెంటిలేటర్ సపోర్టుతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో తమ్మినేని బాధపడుతున్నారని ఏఐజీ వైద్యులు తెలిపారు. లంగ్స్‌లో నీరును వైద్యులు తొలగించారు. ప్రసుత్తం ఐసీయూలో ఉన్న తమ్మినేని ఆరోగ్యం నిలకడగా ఉంది.
