Bhatti Vikramarka: ఖమ్మం జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు చెప్పాలని సమీక్ష సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఇరిగేషన్ శాఖపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల, పొంగులేటితో పాటు అధికారులు పాల్గొన్నారు.
Read Also: CM Revanth Reddy : పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రం తెచ్చుకుందే నీళ్ల కోసమని, దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ వ్యయం రూ.1681కోట్లు కాగా.. రూ.889 కోట్లు 2014 కంటే ముందే ప్రభుత్వం ఖర్చు చేసిందని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా తెలిపారు. ఇందిరా సాగర్ వ్యయం రూ.1824 కోట్లు కాగా.. 1064 కోట్లు ఖర్చు చేశారన్నారు. రెండు ప్రాజెక్టులకు మిగతా రూ.1552 కోట్లు ఖర్చు చేస్తే 4లక్షల ఎకరాలకు నీరు అందేదని ఆయన వెల్లడించారు. సీతారామ ప్రాజెక్టు అని పేరు చెప్పి 18500 కోట్లకు కేసీఆర్ ప్రభుత్వం అంచనా వ్యయం పెంచిందని.. కానీ కొత్త ఆయకట్టు లేదని మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. సీతమ్మ బ్యారేజీకి నీటిని అందించేందుకు రూ. 3,486 కోట్లకు ప్రాజెక్టు ఖర్చు అంచనా వేయగా.. కానీ మొత్తం రూ.4,481కోట్లు ఖర్చు చేశారన్నారు. రీడిజైన్ పేరుతో ఒక్క ఎకరానికి నీరు అందివ్వ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి మూడు సంవత్సరాల్లో సంవత్సరానికి రూ.500 కోట్లు ఖర్చు చేస్తే వేల ఎకరాలకు నీరు వచ్చేదన్నారు. దోపిడీ నుంచి రాష్టాన్ని కాపాడటానికి ప్రజల సహకారం అవసరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. ఈ రకంగా దోపిడీ జరుగుతూ ఉంటే చూస్తే ఊరుకుంటే కడుపు తరుక్కు పోతుందన్నారు.
