NTV Telugu Site icon

Mancherial: మంచిర్యాలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు..

Manchiryal

Manchiryal

Mancherial: తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు మంచిర్యాల జిల్లాను సందర్శించనున్నారు. ఆయనతో పాటు మంత్రులు శ్రీధర్‌ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క కూడా ఈ పర్యటనలో పాల్గొననున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో కీలకమైన ఈ ఐదుగురు నేతలు జిల్లాలో పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ద్వారా మంత్రి బృందం బయలుదేరి, ఉదయం 11 గంటలకు మంచిర్యాలకు చేరుకోనున్నారు. జిల్లాలోని అధికారులతో పాటు సాధారణ ప్రజాప్రతినిధులతో భేటీ అనంతరం, ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఇక మంచిర్యాల చేరుకున్న మంత్రి వర్గం ఉదయం 11:15 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందులో ప్రధానంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేపట్టనున్నారు. ఆ తర్వాత నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పరిశీలన చేపట్టనున్నారు. ఆపై ఇతర స్థానిక కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రజలతో కలిసి మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 1:00 నుండి 1:30 గంటల వరకు విశ్రాంతి అనంతరం, 1:30 గంటలకు మంత్రుల బృందం మంచిర్యాల నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి మధ్యాహ్నం 2:30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ పర్యటన ద్వారా మంచిర్యాల జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని సమీక్షించడంతో పాటు ప్రజలతో నేరుగా కలిసే అవకాశం మంత్రులకు లభించనుంది.