Site icon NTV Telugu

Delhi Car Blast: ఢిల్లీ పేలుడు ఘటన.. దర్యాప్తులో కీలక విషయాలు ఇవే!

Delhi Bomb Blast

Delhi Bomb Blast

దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో ఇప్పటివరకు 9 మంది మరణించగా.. 20 మంది గాయపడ్డారు. పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. దర్యాప్తు సంస్థల ప్రకారం.. కారులో పేలుడు పదార్థాలు అమర్చి బ్లాస్ట్ చేశారు. ఇది ఆత్మాహుతి దాడి అని ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో ఢిల్లీ ఎర్రకోట పేలుడుకు ఫరీదాబాద్ ఉగ్రవాద మాడ్యూల్‌తో సంబంధం ఉందని తేలింది.

పేలుడుకు కారణమైన ఐ20 కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటపడ్డాయి. సోమవారం సాయంత్రం 6:52 గంటలకు పేలుడు జరగగా.. అంతకు కొన్ని క్షణాల ముందు ఓ వ్యక్తి కారు నడుపుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. కారులో ఉన్న వ్యక్తి వైద్యుడైన మహ్మద్‌ ఉమర్‌ అని అధికారులు అనుమానిస్తున్నారు. అతడు నల్ల ముసుగు ధరించి ఉన్నట్లుగా సీసీటీవీ దృశ్యాల్లో ఉంది. అతడా కాదా అని నిర్ధారించడానికి పోలీసులు సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న కారులో లభించిన మృతదేహానికి DNA పరీక్ష నిర్వహించనున్నారు. మహ్మద్‌ ఉమర్‌కు ఫరీదాబాద్‌ మాడ్యూల్‌తో సంబంధాలు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఫరీదాబాద్‌లో భారీ మొత్తంలో అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందిన తర్వాత ఢిల్లీ పోలీసులు సహా ఇతర ఏజెన్సీలు డాక్టర్ ఉమర్ మహ్మద్‌ కోసం వెతుకుతున్నాయి. ఫరీదాబాద్ మాడ్యూల్‌లో ఉగ్రవాది అయిన డాక్టర్ ఉమర్ పరారీలో ఉన్నాడు. ఏజెన్సీలు అతని కోసం వెతుకుతున్నాయి. పేలుడు జరిగిన సమయంలో ఉమర్ ఒంటరిగా కారులో ఉన్నాడని నిఘా వర్గాలు తెలిపాయి. అతను మరో ఇద్దరు ఉగ్రవాదులతో కలిసి దాడికి ప్రణాళిక వేశాడట. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌లో వరుస అరెస్టుల నేపథ్యంలో.. పట్టుబడతాడనే భయంతో భయాందోళనకు గురై ఉగ్రవాద దాడికి ప్రణాళిక వేశాడని, తన సహచరులతో కలిసి కారులో డిటోనేటర్‌ను అమర్చి పేలుడుకు పాల్పడ్డాడని పేర్కొన్నాయి.

Also Read: Shiva Re Release: ‘శివ’ చూడగానే నాన్న ఏమన్నారు.. నాగార్జున సమాధానమేంటంటే?

ఐ20 కారు గురించి ఢిల్లీ పోలీసులు, దర్యాప్తు సంస్థలకు ముఖ్యమైన సమాచారం లభించింది. కారు చివరిసారిగా బదర్‌పూర్ సరిహద్దు వద్ద కనిపించింది. ఆపై బదర్‌పూర్ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించింది. ఆ తర్వాత కారు ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 దగ్గర కనిపించింది. కారు మొహమ్మద్ సల్మాన్ అనే వ్యక్తిది. అతను కారును నదీమ్‌కు విక్రయించాడు. నదీమ్ ఆ కారును ఫరీదాబాద్‌లోని రాయల్ కార్ జోన్ కార్ డీలర్‌కు విక్రయించాడు. ఆ తర్వాత పుల్వామాకు చెందిన తారిక్ దానిని కొనుగోలు చేశాడు. ఆపై ఉమర్ కారును కొనుగోలు చేశాడు. కారు హర్యానాలోని గురుగ్రామ్ నార్త్ ఆర్టీవోలో HR 26 7624 నంబర్‌తో మొహమ్మద్ సల్మాన్ అనే వ్యక్తి పేరుతో రిజిస్టర్ చేయబడింది.

Exit mobile version