Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్‌లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!

Delhi

Delhi

Delhi: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం తెల్లవారుజామున ఒక పెద్ద ప్రమాదం తప్పింది. SWISS ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో వెంటనే టేకాఫ్‌ను నిలిపివేశారు. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించారు.

అందిన వివరాల ప్రకారం, LX147 ఫ్లైట్ (ఎయిర్‌బస్ A330) ఢిల్లీ నుంచి స్విట్జర్లాండ్‌ లోని జ్యూరిచ్‌కు బయల్దేరాల్సి ఉంది. రాత్రి 1.08 గంటల సమయంలో విమానం టేకాఫ్ రన్ ప్రారంభించగా.. ఒక్కసారిగా ఓ ఇంజిన్‌లో లోపం ఏర్పడి మంటలు చెలరేగాయి. పరిస్థితిని గమనించిన పైలట్లు వెంటనే టేకాఫ్‌ ను రద్దు చేసి అత్యవసర చర్యలు చేపట్టారు. ఈ విమానంలో మొత్తం 228 మంది ప్రయాణికులు, నలుగురు శిశువులు ఉన్నారు.

ఈ ఘటనతో వీరందరిని సిబ్బంది అత్యవసర స్లైడ్స్ ద్వారా ప్రయాణికులను రన్‌వేపైకి సురక్షితంగా తరలించారు. కొంతమంది ప్రయాణికులు స్లైడ్స్ ఉపయోగించలేకపోవడంతో వారికి మెట్ల ద్వారా బయటకు తీసుకువచ్చారు. ఈ ప్రక్రియలో ఆరుగురు ప్రయాణికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. అయితే సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.

ఘటన అనంతరం ఎయిర్‌లైన్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ప్రయాణికులకు అవసరమైన సహాయం అందిస్తూ, హోటల్ వసతి, ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లపై చర్యలు తీసుకుంటున్నారు. అలాగే స్థానిక అధికారులతో సమన్వయం చేస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన సాంకేతిక లోపాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి SWISS సంస్థ నిపుణుల బృందాన్ని ఢిల్లీకి పంపుతోంది.