NTV Telugu Site icon

Delhi Air Pollution: ఢిల్లీలో ప్రమాద ఘంటికలు మోగిస్తోన్న వాయుకాలుష్యం.. రంగంలోకి సర్కారు

Delhi Air Pollution

Delhi Air Pollution

Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణా, యూపీ రైతులు పంట వ్యర్థాలను కాల్చేస్తుండటంతో ఆ పొగంతా ఢిల్లీని దట్టంగా కమ్మేస్తోంది. దీంతో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ 400 మార్క్‌ను దాటింది. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ ప్రకార దేశరాజధాని ఢిల్లీలో తీవ్రస్థాయికి చేరగా.. ఏక్యూఐ 408గా నమోదైంది. ప్రస్తుతం యూపీలోని నోయిడాలో 393, హర్యానాలోని గురుగ్రామ్‌లో 318గా నమోదైంది. సెంట్రల్ ఢిల్లీలోని మందిర్ మార్గ్ వంటి కొన్నింటిని మినహాయించి రాజధానిలోని చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 300 కంటే ఎక్కువగా నమోదైంది.

పంజాబ్‌, హర్యానాలో గత రెండు నెలలను వ్యవసాయ వ్యర్థాలను కాల్చివేయడం వల్ల కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. వీటి నియంత్రించాలని ఢిల్లీ సర్కారు పొరుగు ప్రాంతాలను కోరుతున్నా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్‌, నోయిడా వంటి ఢిల్లీకి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రాంతీయ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని యూపీ, హర్యానా ప్రభుత్వాలను ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌రాయ్‌ అభ్యర్థించారు. కాలుష్య సమస్యను అరికట్టాలంటే ఉమ్మడి సహకారం అవసరమని గోపాల్‌ రాయ్‌ పేర్కొన్నారు. కాలుష్యం తీవ్రతరం కావడంతో ఢిల్లీలో అన్ని నిర్మాణ పనులను, కూల్చివేతలను అధికారులు నిలిపివేయించారు. నిషేధ సమయంవో ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి నెలకు రూ.5వేలు అందించాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు కార్యకలాపాలపై ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. మరో వైపు గాలి నాణ్యత మెరుగయ్యే వరకు పాఠశాలలను మూసివేయాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఢిల్లీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండగా.. కాలుష్యం తగ్గించేందుకు ఉద్యోగులు వీలునుబట్టి వర్క్‌ ఫ్రం హోమ్‌ పనిచేయాలని, ప్రైవేట్‌ వాహనాల వినియోగాన్ని తగ్గించాలని రాష్ట్ర మంత్రి గోపాల్‌రాయ్‌ ప్రజలను కోరారు.

Munugodu By Poll: బుకీలపై పోలీసులు కన్ను.. అభ్యర్థుల గెలుపుపై జోరుగా బెట్టింగులు

పొగమంచు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందింగా జాతీయ రాజధాని ప్రాంత ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ, ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలో పెద్ద మొత్తంలో క్రాకర్స్ అమ్మకాలు జరిగాయని నోయిడా నివాసి అర్జున్ ప్రజాపతి ఆరోపించారు. దీనివల్ల కాలుష్యం పెరగడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. దీనిని ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఇది కాకుండా నగరంలో పొగమంచు కమ్ముకోవడంతో వృద్ధులు శ్వాసకోశ వ్యాధుల గురించి ఫిర్యాదు చేస్తున్నారు.