వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మంగళవారం తెల్లవారుజామున పశ్చిమ బెంగాల్‌లోని దీఘా సమీపంలో తీరం దాటింది. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో కొనసాగుతూ.. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో ఈ తీవ్ర వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ.. ఉత్తర ఒడిశా, దక్షిణ జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల మీదుగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాయుగుండం ప్రభావం కనిపించనుంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, బాపట్ల, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తీవ్ర వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. కళింగపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్న ఓడరేవుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయగా.. కోస్తాలోని ఇతర ఓడరేవుల్లో మొదటి నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. ప్రజలు వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున అనవసరంగా సముద్ర తీరాలకు వెళ్లకుండా ఉండాలని కూడా హెచ్చరించారు.

