NTV Telugu Site icon

WPL 2024: ఒక పరుగు తేడాతో బెంగళూరు ఓటమి.. ప్లేఆఫ్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌!

Delhi Capitals Wpl 2024

Delhi Capitals Wpl 2024

Delhi Capitals Women won by 1 run vs Royal Challengers Bangalore in WPL 2024: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఆదివారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఒక్క పరుగు తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై ఢిల్లీ గెలుపొందింది. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇది ఐదో విజయం కాగా.. బెంగళూరుకు నాలుగో ఓటమి. 7 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో ఢిల్లీ ప్లేఆఫ్స్‌లో ప్రవేశించింది. ఏడాది ఢిల్లీ రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటికే ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 5 వికెట్లకు 181 పరుగులు చేసింది. మెగ్‌ లానింగ్‌ (29), షెఫాలీ వర్మ (23) తొలి వికెట్‌కు 54 పరుగులు చేశారు. స్వల్ప వ్యవధిలో లానింగ్‌, షెఫాలీ ఔటైనా.. ఢిల్లీ జోరు తగ్గలేదు. జెమీమా రోడ్రిగ్స్‌ (58; 36 బంతుల్లో 8×4, 1×6), అలీస్‌ క్యాప్సీ (48; 32 బంతుల్లో 8×4) చెలరేగారు. ఇద్దరు ఫోర్లు, సిక్స్‌లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. జెమీమా 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ అందుకుంది. జెమీమా అవుట్ కావడంతో ఢిల్లీ 200 స్కోరు చేయలేకపోయింది. బెంగళూరు బౌలర్ శ్రేయంక పాటిల్‌ (4/26) రాణించింది.

Also Read: Oscar Awards 2024: ఉత్తమ సహాయ నటుడిగా రాబర్ట్‌ డౌనీ జూనియర్‌!

భారీ ఛేదనలో బెంగళూరుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్‌ స్మృతి మంధాన (5) నిరాశపరిచింది. ఎలీస్‌ పెర్రీ (49; 32 బంతుల్లో 7×4, 1×6), సోఫీ మోలనూ (33; 30 బంతుల్లో 5×4) జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరు 10.5 ఓవర్లలో రెండో వికెట్‌కు 89 పరుగులు జత చేశారు. అయితే స్వల్ప వ్యవధిలో పెర్రీ, మోలనూ ఔట్‌ అయ్యారు. వికెట్స్ పడినా సోఫీ డివైన్‌ (26), రిచా ఘోష్‌ (51; 29 బంతుల్లో 4×4, 3×6) ధాటిగా ఆడి బెంగళూరును వెనకబడిపోకుండా చూశారు. అయితే డివైన్‌ ఔట్‌ కావడంతో ఆర్‌సీబీకి గట్టి దెబ్బ తగిలింది. ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికే రిచా సిక్స్‌ బాదింది. తర్వాతి 3 బంతులకు 2 పరుగులే వచ్చాయి. అయిదో బంతికి రిచా సిక్స్‌ కొట్టడంతో చివరి బంతికి 2 పరుగులు చేయాల్సి వచ్చింది. రిచా జోరు మీద ఉండడంతోఆర్‌సీబీ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. అయితే చివరి బంతికి సరైన షాట్‌ ఆడని రిచా.. పరుగు తీసే క్రమంలో రనౌట్‌ అయింది. దాంతో ఢిల్లీ ఒక పరుగు తేడాతో గెలుపొందింది.