NTV Telugu Site icon

RR vs DC: పీకల్లోతు కష్టాల్లో ఢిల్లీ.. ఐపీఎల్‌లో డేవిడ్‌ వార్నర్‌ మరో కొత్త రికార్డు

David Warner

David Warner

RR vs DC: ఐపీఎల్‌ సీజన్‌-16లో భాగంగా ఇవాళ అస్సాం రాష్ట్రం గౌహతిలోని బర్సపారా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌-రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. ట్రెంట్‌ బౌల్డ్‌ వేసిన తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూడో బంతికి పృథ్వీ షా (0) ఔట్‌ చేసిన బౌల్ట్‌.. ఆ మరుసటి బంతికే మనీశ్‌ పాండే (0)ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. అనంతరం వచ్చిన వార్నర్, రిలీ రొసో ఇన్నింగ్స్‌ను కొంచెం చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ అశ్విన్‌ బౌలింగ్‌లో అనవసర స్వీప్‌ షాట్‌ ఆడి వికెట్‌ సమర్పించుకున్నాడు రిలీ రొస్సో (14).

Ipl Ad

ఢిల్లీ క్యాపిటల్స్ 10 ఓవర్లలో 3 కీలక వికెట్లను కోల్పోయి 68 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించాలంటే మరో 132 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్(33), లలిత్ యాదవ్(16) ఉన్నారు. ట్రెంట్‌ బౌల్ట్‌ రెండు వికెట్లు తీయగా, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తీయగలిగాడు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ మరో రికార్డు సాధించాడు. ఐపీఎల్‌లో 6000 పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 6000 పరుగులు చేసిన బ్యాటర్‌గా డేవిడ్ వార్నర్ నిలిచాడు. 165 ఇన్నింగ్స్‌లోనే డేవిడ్ వార్నర్ 6వేల పరుగులు సాధించడం గమనార్హం.

ముందుగా రాజస్థాన్‌ ఓపెనర్లు యశస్వి (60), బట్లర్‌ (79) మెరుపు అర్ధశతకాలు సాధించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఆఖర్లో హెట్‌మైర్‌ (39 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. డీసీ బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌ 2, కుల్దీప్‌, రోవ్‌మన్‌ పావెల్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.