చిత్రదుర్గ వాసి రేణుకాస్వామిని దారుణంగా హత్య చేసిన కేసులో కన్నడ నటుడు దర్శన్, పవిత్ర గౌడ్, మరికొందరిని మంగళవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరికి తొలుత ఆరు రోజుల పోలీసు కస్టడీ విధించగా, అది రేపు ఆదివారంతో ముగియనుంది. అయితే రేపు ఆదివారం కావడంతో పోలీసులు వారిని ఒకరోజు ముందుగానే కోర్టు ముందు హాజరుపరిచారు. వారి కస్టడీని పొడిగించాలని పోలీసులు కోర్ట్ ని అభ్యర్థించగా, దానికి న్యాయమూర్తి ఆమోదం తెలిపారు, అదనంగా ఐదు రోజుల పోలీసు కస్టడీకి ఆదేశాలు జారీ చేశారు.
వారి కోర్టుకు హాజరు కావడానికి ముందు, 15 మంది నిందితులు అన్నపూర్ణేశ్వర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు, ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకుని ఒకేసారి కోర్టు ముందు హాజరుపరిచారు. తదుపరి విచారణకు మరియు కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను పొందడానికి అదనపు సమయం అవసరమని పోలీసు న్యాయవాదులు వాదించారు. తొలుత తొమ్మిది రోజులు కోరగా, ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం చివరికి వారి కస్టడీని ఐదు రోజుల పాటు పొడిగించినట్లు తెలుస్తుంది.