DharmaSthala Case: కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థల కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగిస్తోంది. సిట్ గుర్తించిన 13 ప్రాంతాల్లో తవ్వకాలు జరిపేందుకు రంగంలోకి దిగింది. తాజాగా బంగాలగుడ్డ ప్రాంతంలో ఏడవ రోజైన మంగళవారం కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తవ్వకం పనులను ముమ్మరం చేసింది. ఇప్పటివరకు, ఈ ఆపరేషన్లో భాగంగా దాదాపు 100 ఎముకల అవశేషాలు వెలికితీయబడ్డాయి. దీనితో పాటు, సైట్ నంబర్ 6, సైట్ నంబర్ 11-A నుంచి అస్థిపంజర అవశేషాలు బయటపడ్డాయి. ఇందులో విశేషం ఏమిటంటే ఈ సైట్ నంబర్ 11-A ఫిర్యాదుదారు గుర్తించిన ప్రదేశం కాదు.
READ MORE: Telangana Govt: ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం ధర్నా.. కేంద్రంపై ఒత్తిడి తెస్తాం: సీఎం రేవంత్
ప్రతి చిన్న పాయింట్లోనూ జాగ్రత్తగా తవ్వకాలు..
సైట్ నంబర్ 11-A ప్రదేశం ఫిర్యాదుదారు చెప్పిన ప్రాంతానికి దగ్గరగా ఉంది. కానీ సరిగ్గా అదే కాదు. ఈక్రమంలో SIT ప్రతి చిన్న పాయింట్లోనూ జాగ్రత్తగా తవ్వుతోంది. మంగళవారం మూడు వేర్వేరు ప్రదేశాలలో తవ్వాలని SIT నిర్ణయించింది. దీని ద్వారా వర్షంలో కూడా ఏదైనా ముఖ్యమైన ఆధారాలు లేదా మానవ అవశేషాలు ఉంటే, వాటిని సులభంగా కనుగొనవచ్చని నిర్ణయించింది. ఈనేపథ్యంలో సంఘటనా స్థలంలో భద్రతను కూడా పెంచారు. దర్యాప్తు ముందుకు వెళ్లేందుకు పోలీసు డాగ్ స్క్వాడ్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది.
రహస్యంగా ఆపరేషన్..
ఈ మొత్తం ఆపరేషన్ రహస్యంగా నిర్వహిస్తున్నట్లు SIT వర్గాలు తెలిపారు. సోమవారం వెలికితీసిన అస్థిపంజరాల అవశేషాలు ఒక వ్యక్తికి చెందినవని భావిస్తున్నారు. అయితే ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) నివేదిక వచ్చిన తర్వాతే తుది నిర్ధారణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. FSL బృందం ప్రస్తుతం ఎముకలకు శాస్త్రీయ పరీక్షలు నిర్వహిస్తోంది. కొన్ని చోట్ల మట్టి, రాళ్లు మాత్రమే దొరికాయని, మరికొన్ని చోట్ల ఎముక ముక్కలు దొరికాయని దర్యాప్తులో వెల్లడించింది.
అడ్డంకిగా మారిన వర్షం
తవ్వకాలు జరపడానికి ఇప్పుడు సైట్ నంబర్ 12, 13 మాత్రమే మిగిలి ఉన్నాయని ఒక పోలీసు అధికారి పేర్కొన్నారు. ఇవి పూర్తయిన తర్వాత అవసరమైతే, ఇతర ప్రదేశాలలో కూడా తవ్వకాలు చేయవచ్చని వెల్లడించారు. దర్యాప్తులో ఇప్పుడు పెద్ద అడ్డంకిగా నిరంతర వర్షం మారిందని అన్నారు. తడినేల కారణంగా కార్మికులు, యంత్రాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. 11-A సైట్ నుంచి మూడు అస్థిపంజరాలు దొరికాయని న్యాయవాదులు చెబుతుంటే, పోలీసు వర్గాలు మాత్రం ఈ వాదనను పూర్తిగా తోసిపుచ్చాయి. ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరు సాక్షులు ముందుకు వచ్చారు. వారి వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.