Site icon NTV Telugu

Danish Malewar: దేశవాళీ క్రికెట్‌లో నయా సెన్సేషన్‌.. దులిప్‌ ట్రోఫీలో మలేవర్‌ సంచలన ఇన్నింగ్స్!

Danish Malewar 198

Danish Malewar 198

దేశవాళీ క్రికెట్‌లో నయా సెన్సేషన్‌. దులిప్‌ ట్రోఫీ టోర్నమెంట్‌లో బ్యాటర్‌ డానిష్‌ మలేవర్‌ సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. దులిప్‌ ట్రోఫీ తొలి క్వార్టర్‌ ఫైనల్లో భాగంగా నార్త్‌ ఈస్ట్‌ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సెంట్రల్‌ జోన్‌ బ్యాటర్‌ మలేవర్‌ డబుల్‌ సెంచరీకి రెండు పరుగుల దూరంలో నిలిచాడు. మొదటిరోజు ఆటలో 35 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో 198 పరుగులు బాదాడు. రెండో రోజు అతడు డబుల్ సెంచరీ మార్క్ అందుకునే అవకాశాలు ఉన్నాయి. విదర్భకు చెందిన మలేవర్‌ సహా కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (96 బంతుల్లో 125) చెలరేగడంతో సెంట్రల్‌ జోన్‌ మొదటి రోజు ఆట ముగిసేవరకు 77 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 432 రన్స్ చేసింది.

మొదటి రోజున 21 ఏళ్ల డానిష్ మలేవర్‌ అందరి దృష్టిని ఆకర్షించాడు. 219 బంతులు ఎదుర్కొని 198 పరుగులు సాధించాడు. కెప్టెన్ రజత్ పాటిదార్‌తో కలిసి 174 బంతుల్లో 205 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రంజీ ట్రోఫీ ఫైనల్ 2025లో మలేవర్‌ కేరళపై 153, 73 పరుగులు చేశాడు. దాంతో విదర్భ టైటిల్ గెలుచుకుంది. ఇప్పటివరకు మలేవర్‌ 10 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 65.4 సగటుతో 981 పరుగులు చేశాడు. ఇటీవలే దేశవాళీ దిగ్గజం ఛతేశ్వర్‌ పుజారా అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగాడు. ఈ నేపథ్యంలో ‘నయా వాల్‌’ పుజారాకు వారసుడు వచ్చాడు అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మలేవర్‌ రైటార్మ్‌ బ్యాటర్‌ మాత్రమే కాకుండా.. లెగ్‌బ్రేక్‌ స్పిన్నర్‌ కూడా.

Also Read: Asia Cup 2025: 15 మందిలో ఆ ముగ్గురే గేమ్‌ ఛేంజర్లు.. సెహ్వాగ్ లిస్టులో లేని స్టార్స్!

రజత్ పాటిదార్‌ కేవలం 80 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 66వ ఓవర్లో ఫిరోజామ్ జోతిన్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. పాటిదార్‌ 96 బంతుల్లో 130.20 స్ట్రైక్ రేట్‌తో 125 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 21 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. పాటిదార్ 69 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 4863 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు చేశాడు. మధ్యప్రదేశ్ తరపున పాటిదార్‌ దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. అక్టోబర్ 2015లో వడోదరపై తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. పాటిదార్‌ ఐపీఎల్ 2025లో ఆర్సీబీని విజేతగా నిలిపిన విషయం తెలిసిందే.

 

 

 

Exit mobile version