Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..

Danish Kaneria

Danish Kaneria

Danish Kaneria: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓవైపు ఓటర్ల జాబితాలో అక్రమాలంటూ సీజేపీ (CJP) తలపెట్టిన భారీ నిరసన ప్రదర్శనతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నిరసనను అణచివేయడానికి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సరిగ్గా ఇదే సమయంలో పాకిస్థాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా చేసిన ఒక సెటైరికల్ కామెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఢిల్లీ పోలీసుల కఠిన భద్రత, ముందస్తు ఏర్పాట్లను చూసి ఆయన ఎద్దేవా చేస్తూ చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

తన బోల్డ్ కామెంట్స్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలిచే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా, ఢిల్లీలో పోలీసుల భారీ మోహరింపుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “ఢిల్లీ పోలీసులు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంటారని నేను ఆశిస్తున్నాను!” అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోలీసుల కఠినమైన భద్రతా చర్యలను క్రికెట్ భాషలో ఆయన చేసిన ఈ సెటైర్ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. ఢిల్లీలో ఎన్నికల ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియలో జరిగిన పొరపాట్లు, అక్రమాల ఆరోపణలపై నిరసన తెలిపేందుకు ఆందోళనకారులు జంతర్ మంతర్ వైపు కదిలేందుకు సిద్ధమయ్యారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ పరిసరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. మండి హౌస్ నుంచి జంతర్ మంతర్ వరకు భారీగా భద్రతా బలగాలను మోహరించారు. మండి హౌస్ సర్కిల్ నుంచి జంతర్ మంతర్ వెళ్లే అన్ని ప్రధాన మార్గాలు, సందుల్లో భారీ బారికేడ్లను ఏర్పాటు చేసి దారులు మూసేశారు. ఫిరోజ్‌షా రోడ్, బారాఖంబా రోడ్, కన్నాట్ ప్లేస్ తదితర మార్గాలలో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ప్రజలు ఎవరూ ఆ వైపు వెళ్లకుండా పోలీసులు గట్టి నిఘా పెట్టారు.