Site icon NTV Telugu

Janasena and BJP Alliance: జనసేన – బీజేపీ పొత్తు.. పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు

Bjp

Bjp

Janasena and BJP Alliance: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన-బీజేపీ పొత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి.. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఆ తర్వాత టీడీపీ-జనసేన కలిసి ముందుకు వెళ్తాయని ప్రకటించారు.. ఇదే సమయంలో.. ఇప్పటికే బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఉంది.. ఇప్పుడు టీడీపీ, జనసేనతో బీజేపీ కలిసి వస్తుందా? లేదా? అనేది వారే తేల్చేకోవాలని పేర్కొన్నారు.. అయితే, ఇప్పటికే బీజేపీ అధిష్టానమే పొత్తుల విషయం చూసుకుంటుందని స్పష్టం చేసిన బీజేపీ ఏపీ అధ్యక్షులు పురంధేశ్వరి.. ఇప్పుడు మరోసారి స్పందించారు.

ఈ రోజు బీజేపీ ఏపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది.. టీడీపీతో పవన్ కల్యాణ్‌ పొత్తుల ప్రకటన తర్వాత నెలకొన్న గందరగోళంపై ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది.. బీజేపీతో పొత్తులో ఉంటూ టీడీపీతో పొత్తుపై ఎలా ప్రకటన చేస్తారనే అంశంపై బీజేపీలో అసహనం వ్యక్తం కాగా.. పవన్ ఎవరితో పొత్తులో ఉన్నారనే అంశంపై క్లారిటీ బీజేపీ ఇచ్చే ప్రయత్నం చేసింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పరిణామాలపై కూడా కోర్‌ కమిటీలో చర్చ సాగినట్టుగా తెలుస్తోంది.. ఇక, కోర్‌ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత పురంధేశ్వరి మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌ చేసే ప్రతి కామెంట్‌పై నేను స్పందించాల్సిన అవసరం లేదన్నారు. పొత్తులపై పవన్ కల్యాణ్‌ ప్రకటన.. ఆయన అభిప్రాయాలను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తాం.. పొత్తులు.. పవన్ కామెంట్ల విషయంలో జాతీయ పార్టీ సూచనల మేరకు వ్యవహరిస్తామని పేర్కొన్నారు.

ఇక, ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌తో పొత్తు కొనసాగుతుందా..? లేదా..? అనే అంశం పైనా జాతీయ నాయకత్వమే చెప్పాలని వ్యాఖ్యానించారు పురంధేశ్వరి.. పొత్తులపై పవన్ తన అభిప్రాయాన్ని చెప్పారు.. మా అభిప్రాయాన్ని జాతీయ నాయకత్వమే చెబుతుందన్నారు. మాది ప్రాంతీయ పార్టీ కాదు.. జాతీయ పార్టీ.. అన్ని నిర్ణయాలు అధిష్టానమే తీసుకుంటుందని స్పష్టం చేశారు. మరోవైపు.. ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా సేవా పక్షోత్సవాల ఎలా జరిగాయనే అంశంపై కోర్‌ కమిటీలో విశ్లేషించుకున్నాం. ఆయుష్మాన్ భారత్ కార్డులు 10596 కార్డులను పేదలకు పంపిణీ చేశాం.. మండల ప్రవాస్ కార్యక్రమంలో భాగంగా పార్టీ బలోపేతం కోసం కృషి చేశాం అన్నారు. త్వరలో రాష్ట్ర కార్యవర్గం జరుగుతుంది.. జేపీ నడ్డా హాజరు అవుతారని వెల్లడించారు. మరోవైపు.. మద్యం మీద, గ్రామ పంచాయతీ రాజ్ సంస్థల నిధుల మళ్లింపుపై ఆందోళనలు చేపట్టాం.. కేంద్ర బృందం వచ్చి.. నిధుల మళ్లింపుపై విచారణ చేపట్టిందని తెలిపారు. ఏపీలో స్థానిక సంస్థల నిధుల మళ్లింపు జరిగిందని కేంద్ర బృందం నిర్దారణకు వచ్చిందన్నారు. నాణ్యత లేని మద్యం వల్ల లివర్ సిరోసిస్ వ్యాధి పెరిగిందని.. కేజీహెచ్ వైద్యులు స్పష్టం చేశారని వెల్లడించారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.

Exit mobile version