Site icon NTV Telugu

Cyclone Sitrang : బంగ్లాదేశ్‌లో ‘సిత్రాంగ్’ బీభత్సం.. 2.19 లక్షల మంది ఇళ్లు ఖాళీ

Sitrang

Sitrang

Cyclone Sitrang : తుఫాను ‘సిత్రాంగ్’ బలపడి బంగ్లాదేశ్ వైపు కదులుతున్నందున పశ్చిమ బెంగాల్, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు, తుఫాను బెంగాల్‌లోని సాగర్ ద్వీపానికి దక్షిణ, ఆగ్నేయ దిశలో 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్‌ ప్రభావంతో పరిసర ప్రాంతాల్లో 2.4 మీటర్ల ఎత్తున సముద్రపు అలలు ఎగిసిపడుతున్నట్లు తెలిపింది.

ఐఎండీ ప్రకారం, తుఫాను రేపు తెల్లవారుజామున టింకోనా ద్వీపం, శాండ్‌విప్‌కు దగ్గరగా ఉన్న బంగ్లాదేశ్ తీరం దాటే అవకాశం ఉంది. ఈశాన్య ప్రాంతంలో భారీ వర్షాలు, బలమైన గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. 24 గంటల్లో గరిష్టంగా 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున త్రిపురలో అత్యధికంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. త్రిపుర, మేఘాలయ, అస్సాంలకు రెడ్ అలర్ట్, మిజోరాం, నాగాలాండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. త్రిపుర, మిజోరంలలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

Read Also: Diwali Crackers : పండుగ రోజు విషాదం.. 11 ఏళ్ల బాలుడిని బలిగొన్న టపాసులు

‘సిత్రాంగ్’ తుపాను బంగ్లాదేశ్‌లోని భోలా, నారియల్ జిల్లాల్లో విరుచుకుపడుతోంది. భోలా జిల్లాలోని దౌలత్‌ఖాన్, నారియల్ జిల్లాలోని చర్ఫాషాన్‌లలో చెట్లు కూలి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, తుపాను కారణంగా పలువురు గాయపడినట్టు అధికారులు తెలిపారు. నైరుతి బంగ్లాదేశ్‌లోని తీర ప్రాంతాలను తుపాను తాకే అవకాశం ఉండడంతో 2.19 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే, 6,925 తుపాను కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.

Read Also:Air Polution: ఢిల్లీలో తీవ్రస్థాయికి వాయుకాలుష్యం.. దీపావళి వేళ రెచ్చిపోయిన రాజధానివాసులు

సోమవారం సాయంత్రం 5 గంటల సమయానికి తీర ప్రాంతంలోని 15 జిల్లాల నుంచి 2,19,990 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు చెప్పారు. తుపాను తీరం దాటినప్పుడు అలలు ఎగసిపడతాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాక్స్ బజార్‌లోని షెల్టర్లలో 10 లక్షల మందికిపైగా రోహింగ్యాలు ఉన్నారని పేర్కొన్న అధికారులు, వారికి అత్యవసరాలైన ఆహారం, మందులు, నీళ్లు, టార్పాలిన్లు అందిస్తున్నారని పేర్కొన్నారు.

Exit mobile version