Cyclone Murasu: ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!

Ap Rains Alert

Ap Rains Alert

AP Weather Update Today: మురసు తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లోనూ చెదురుమదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

మురసు తుఫాన్ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు ఇవాళ సెలవు ప్రకటించారు. వర్షాల నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను బయటకు పంపకుండా ఇంటి వద్దనే సురక్షితంగా ఉంచాలని కలెక్టర్ సూచించారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, ప్రజల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ వెల్లడించారు. మరోవైపు వర్షాల ప్రభావంతో కాకినాడ జిల్లాలోనూ కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అధికారుల సూచనలు పాటించాలని తెలిపారు.