NTV Telugu Site icon

Cyclone Michuang Updates: మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. వేలాది ఎకరాల్లో పంట నష్టం!

Paddy Filed Damaged

Paddy Filed Damaged

Thousands of acres of crops damaged due to Cyclone Michuang: బంగాళఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. తిరుపతి జిల్లా చిట్టేడులో అత్యధికంగా 39 సెంమీ వర్షపాతం నమోదవగా.. నెల్లూరు జిల్లా మనుబోలులో 36.8 సెంమీ నమోదైంది. అల్లంపాడులో 35 సెంమీ, చిల్లకూరులో 33 సెంమీ, నాయుడుపేటలో 28.7 సెంమీ, ఎడ్గలిలో 24 సెంమీ, బాపట్లలో 21 సెంమీ, మచిలీపట్నంలో 14.9 సెంమీ వర్షపాతం నమోదైంది. చాలా చోట్ల 10 సెంమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు వర్ష సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఈదురుగాలులకు నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్‌ సెంటర్‌లో భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నెల కూలిపోయాయి. అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలంలో వేలాది అరటి చెట్లు నేలకొరిగాయి. నేతివారిపల్లి, నగిరిపాడు పరిధిలో సుమారు 25 వేల అరటి చెట్లు నేల కూలినట్లు రైతులు తెలిపారు. తుపాను ప్రభావంతో బాపట్ల మండలంలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పికట్లలో వేలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. కర్లపాలెంలో పచ్చి మిర్చి, కొరిసపాడులో పొగాకు పంటలు నీటమునిగాయి.

Also Read: Cyclone Michuang: ఆత్మకూరు బస్టాండ్‌లో మోటార్లు పెట్టి నీటిని తోడుతున్న అధికారులు!

కృష్ణా జిల్లా దివిసీమలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరితో పాటు ఇతర పంటలు పూర్తిగా నీట మునిగాయి. బస్తాల్లోని ధాన్యం కూడా తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా కలసపాడు మండలంలోని పలు గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వందల ఎకరాల్లో వ‌రి, మొక్కజొన్న, మిర్చి, పొగాకు, ప‌సుపు, మినుము, ఉల‌వ‌ పంట‌లు దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు. కోట్లలో పంటలకు న‌ష్టం వాటిల్లడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.