Heavy Rains in AP Due to Michaung Cyclone: మిచాంగ్ తుపాను తరుముకొస్తోంది. ప్రస్తుతం నెల్లూరుకు 20 కిమీ, బాపట్లకు 110 కిమీ దూరంలో ఇది కేంద్రీకృతమైంది. తుపాను కారణంగా కోస్తాంధ్ర, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 110 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తీరానికి అత్యంత దగ్గరగా తుపాను కదులుతోందని ఐఎండీ ఓ ప్రకటనలో తెలిపింది. గడిచిన 6 గంటలుగా గంటకు 7 కిమీ వేగంతో ఉత్తర దిశగా తుపాను కదులుతున్నట్లు పేర్కొంది.
‘మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో కోస్తాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. విజయవాడతో పాటు గుంటూరు, జిల్లా, కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Also Read: Crocodile : రోడ్డు దాటుతున్న మొసలి.. సెకనులో తప్పించుకున్న ఉద్యోగి
మిచాంగ్ కారణంగా నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలోని 9 మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. తిరుమలలోని గోగర్భం, పాపవినాశనం జలాశయాల గేట్లను టీటీడీ అధికారులు ఎత్తివేశారు. భారీగా చేరిన వరద నీటితో జలాశయాలు పూర్తిగా నిండిన కారణంగా.. ఒక్కో గేటును ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. వర్షం, గాలుల తీవ్రతకు పలు జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాలుల తీవ్రతకు కొన్నిచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈదురు గాలులకు వేలాది ఎకరాల్లో వరి, ఇతర పంటలకు నష్టం కలిగింది.