Cyclone Arnab: ఏపీని ఒక్కసారిగా కుదిపేసిన అర్నబ్ తుఫాన్ ఎట్టకేలకు కోనసీమ మీదుగా తీరం దాటింది. ప్రస్తుతం గంటకు 120 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణలోనూ ఉండనుంది. నేడు(బుధవారం) తెలంగాణలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ తుఫాను ప్రభావం కనిపించనుంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. పైన పేర్కొన్న నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు.. జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయట. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక, గురువారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే సమయంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. తుఫాను సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున ముందుగానే టార్చ్ లైట్లు, ఎమర్జెన్సీ లైట్లు, పవర్ బ్యాంక్‌లను పూర్తిగా ఛార్జ్ చేసి ఉంచుకోవాలి. తగినంత తాగునీరు, ఫుడ్ ముందుగానే సిద్ధం చేసుకోవాలి. బలమైన గాలుల వల్ల కూలిపోయే ప్రమాదం ఉన్న పాత భవనాలు, చెట్లు, కరెంట్ స్తంభాలు, ప్రకటనల హోర్డింగ్‌ల కింద నిలబడకూడదు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడేటప్పుడు విద్యుత్ ఉపకరణాలను వాడకూడదు. ఇంట్లోని వైఫై, టీవీ కనెక్షన్లను ప్లగ్ నుండి తొలగించడం సురక్షితం.

