NTV Telugu Site icon

Cyber Crime: ఎస్‌బీఐ బ్యాంక్‌కే టోకరా.. 175 కోట్లు మాయం చేసిన సైబర్ నేరగాళ్లు!

Cyber Crime

Cyber Crime

Cyber Crime in SBI Bank: దేశంలో రోజురోజుకు ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగిపోతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. కొత్తకొత్త మార్గాల్లో అమాయకుల బ్యాంక్ ఖాతా నుండి డబ్బును ఈజీగా దొంగిలిస్తున్నారు. అమాయక ప్రజలనే కాదు.. బ్యాంక్‌లను కూడా దోచేసుకుంటున్నారు. తాజాగా స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కే టోకరా వేశారు. ఎస్‌బీఐ బ్యాంక్‌ నుంచి ఏకంగా 175 కోట్లు మాయం చేశారు. ఈ ఘటన హైదరాబాద్ షంషీర్గంజ్ ఎస్‌బీఐ బ్యాంక్‌లో చోటుచేసుకుంది.

సైబర్ క్రైమ్ బ్యూరో తాజాగా షంషీర్గంజ్ ఎస్‌బీఐ బ్యాంక్‌లో 175 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు గుర్తించింది. ఆరు నకిలీ అకౌంట్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు లావాదేవీలు నిర్వహించారు. రెండు నెలల్లో ఆరు అకౌంట్ల ద్వారా 175 కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్లు సైబర్ క్రైమ్ బ్యూరో గుర్తించింది. సైబర్ నేరగాళ్ల కోసం హైదరాబాద్ వాసులు ఆరు అకౌంట్లు ఓపెన్ చేశారు. సైబర్ నేరగాళ్ల కోసం పనిచేసిన మహ్మద్ షాహిబ్, బిన్ హమాద్‌లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో అరెస్ట్ చేసింది.

Also Read: CM Revanth Reddy: క్రీడలకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణను తీర్చిదిద్దుతాం: రేవంత్ రెడ్డి

ఇద్దరు యువకులు అకౌంట్స్ ద్వారా దుబాయ్‌కి డబ్బుని ట్రాన్స్ఫర్ చేశారు. కొంత నగదు డ్రా చేసి మరో అకౌంట్లో డిపాజిట్ చేశారు. ఆరు అకౌంట్లోకి 600 కంపెనీలతో లింకు ఉన్నట్లు సైబర్ క్రైమ్ బ్యూరో అధికారులు గుర్తించారు. క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బుని విదేశాలకు పంపారు. కొంత డబ్బును హవాలా ద్వారా దుబాయ్‌కి పంపారు. డబ్బులకు ఆశపడే హైదరాబాద్ వాసులు అకౌంట్లు తెరిచారు. 175 కోట్ల రూపాయల ఈ భారీ స్కాంపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తోంది.