Site icon NTV Telugu

Cyber Crime: ‘డిజిటల్ అరెస్ట్’.. సైబర్ క్రిమినల్స్‌కు ఇదో ఆయుధం..రిటైర్డ్ హెడ్మాస్టర్‌ నుంచి రూ. 93 లక్షలు కొట్టేశారు

Cyber Crime

Cyber Crime

సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. ఒక చిన్న కాల్‌తో అమాయకుల బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ఓ రిటైర్డ్ హెడ్మాస్టర్‌కు కాల్ చేసి ఏకంగా 93 లక్షలు కొట్టేశారు. ఆమె ఖాతా నుంచి 10 సార్లు డబ్బు డ్రా చేసుకున్నారు కేటుగాళ్లు. అంతా అయిపోయాక మోసపోయామని పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. డిజిటల్ అరెస్ట్.. సైబర్ క్రిమినల్స్‌కు ఇదో ఆయుధం. అమాయకులు, చదువు రాని వారు దొరికితే చాలు.. సైబర్ కేటుగాళ్లు ఈ పదాన్ని వాడేస్తుంటారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం.. లేదా మీరు డిజిటల్ అరెస్ట్‌లో ఉన్నారు.. అంటూ హాడావుడి చేస్తారు… బెదిరించేస్తారు. ఈ మధ్య… చదువుకున్న వాళ్లు, వృద్ధులను సైబర్ ఫ్రాడ్స్ టార్గెట్ చేస్తున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ రిటైర్డ్ ఉపాధ్యాయురాలిని ఇలాగే బురిడీ కొట్టించి ఏకంగా రూ. 93 లక్షలు కొట్టేశారు.

Also Read:GST Council: జీఎస్టీలో మార్పులు.. సామాన్యులకు భారీ ఊరట.. తగ్గిన వస్తువుల పూర్తి జాబితా ఇదే..

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన 64 ఏళ్ల విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు కాకరపర్తి రాజరాజేశ్వరి సైబర్ మోసగాళ్ల వలలో చిక్కింది. జులై 25న ఆమెకు ఓ వీడియోకాల్‌ వచ్చింది. పోలీస్‌ డ్రైస్‌లో ఉన్న ఓ వ్యక్తి కర్ణాటక గాంధీనగర్‌ ఎస్‌ఐని అంటూ పరిచయం చేసుకున్నాడు. ‘మీ ఆధార్‌ నంబరుతో ఒక వ్యక్తి సెల్‌ నంబరు తీసుకొని అమ్మాయిలను ఏడిపిస్తున్నాడు. మేం అతనిని అరెస్టు చేశాం. మీకు 80 లక్షల రూపాయలు చెల్లించి మీ ఆధార్‌కార్డు కొనుగోలు చేసినట్లు చెపుతున్నాడు. ఆమొత్తం మీ ఖాతాకు జమ చేశానంటూ మాకు ఆధారాలు చూపించాడు.

అతను చెప్పిన దానికి అప్పటికే రాజరాజేశ్వరి హతాశురాలైంది. కానీ అతడు తన సంభాషణ ఆపలేదు. నేరంలో భాగంగా మిమ్మల్ని అరెస్ట్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని బాంబు పేల్చాడు. దీంతో రాజరాజేశ్వరికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. కాస్త భయపడిందని నిర్ధారించుకున్న తర్వాత.. సుప్రీం కోర్టు ఆదేశాలతో మిమ్మల్ని అరెస్ట్ చేసేందుకు వస్తున్నామని చెప్పాడు ఆ కేటుగాడు. కంగారు పడ్డ రాజరాజేశ్వరి.. తన ఆధార్ కార్డ్ తన దగ్గరే ఉందని.. ఎవరికి అమ్మలేదని చెప్పే ప్రయత్నం చేసింది. అంతే కాదు తన బ్యాంకు ఖాతాకు ఎలాంటి సొమ్ము జమ కాలేదని తెలిపింది.

రాజేశ్వరి భయపడుతున్న విషయాన్ని గమనించి వీడియో కాల్‌లో ఉన్న వ్యక్తి… బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీ వివరాలు తమకు పంపించాలని.. పూర్తి స్థాయిలో తనిఖీ చేసి తప్పులేదని తేలితే వదిలేస్తామని చెప్పాడు. లేకుంటే చిక్కుల్లో పడతారని బెదిరించాడు. ఈ కేసు విషయం ఎవరికైనా చెపితే వాళ్లనూ అరెస్టు చేస్తామని హెచ్చరించాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆమె… తనఖాతాల వివరాలను వారికి చెప్పింది. బంగారం తాకట్టు పెట్టి మరీ దఫ దఫాలుగా తన ఖాతాలో 98 లక్షలు జమ చేసింది.

Also Read:UK Energy Drink Ban: 16 ఏళ్ల లోపు పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్‌ అమ్మకాలపై నిషేధం!

ఆ మొత్తాన్నిఅవతలి వ్యక్తి నెల రోజుల్లో 10 సార్లుగా డ్రా చేసేశాడు. ఆ తరువాత నుంచి ఆ వ్యక్తి ఫోన్‌ తీయడం మానేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఐతే ఎవరికి పడితే వాళ్లకు బ్యాంకు వివరాలు, ఓటీపీలు అసలే ఇవ్వవద్దని పోలీసులు చెబుతున్నారు. అంతే కాదు..అసలు డిజిటల్ అరెస్ట్ అనే ప్రక్రియే లేదని చెబుతున్నారు. ఎవరైనా అలా చెప్పారంటే కచ్చితంగా సైబర్ క్రిమినల్స్ అని గుర్తు పెట్టుకోవాలంటున్నారు.

Exit mobile version