MS Dhoni-Six: విశాఖలో చెలరేగిన ఎంఎస్ ధోనీ.. పండగ చేసుకున్న ఫ్యాన్స్! వైరల్ వీడియో

Ms Dhoni Batting

Ms Dhoni Batting

MS Dhoni Slams 37 Not Out Off 16: అభిమానులు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ చూసి ఏడాది అవుతోంది. ఈ సీజన్‌లో చెన్నై ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడినా.. ధోనీ బ్యాటింగ్‌కు దిగలేదు. దాంతో మహీ ఎప్పుడు బ్యాటింగ్‌కు వస్తాడోనని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఆదివారం అభిమానుల ఆశ నెరవేరింది. వైజాగ్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహీ తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. రావడమే కాదు ధనాధన్‌ షాట్లతో అలరించాడు. కేవలం 16 బంతులు మాత్రమే ఆడిన ధోనీ.. 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జ్ వేసిన చివరి ఓవర్‌లో అయితే మహీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 4, 6, 0, 4, 0, 6తో ఏకంగా 20 పరుగులు రాబట్టాడు. ఆ ఓవర్‌లో సింగిల్‌ హ్యాండ్‌తో కొట్టిన సిక్స్‌ మ్యాచ్‌ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. ధోనీ బౌండరీ కొట్టినప్పుడల్లా విశాఖ స్టేడియం దద్దరిల్లింది.

Also Read: Off The Record : వైసీపీకి వరంగా మారిన చంద్రబాబు వ్యాఖ్యలు

ఎంఎస్ ధోనీ జోరు చూస్తే.. అతను ఒక ఓవర్‌ ముందే బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ గెలిచేదేమో అభిమానులకు అనిపించింది. మహీ మెరుపు ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ‘తలా ఈజ్‌ బ్యాక్‌’, ‘వింటేజ్‌ ధోనీ విధ్వంసం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్ 2024లో మహీ మరిన్ని మంచి ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుంటున్నారు.