Simi Singh Liver Failure: ఐర్లాండ్ ఆల్‌రౌండర్ సిమీ సింగ్ ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నాడు. గత కొన్ని రోజులుగా కాలేయం వైఫల్యంతో బాధపడుతున్న అతడు.. గురుగ్రామ్ మేదాంత హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. కాలేయ మార్పిడి తప్పనిసరి అని డాక్టర్లు చెప్పడంతో.. 37 ఏళ్ల సిమీ సింగ్ దాతల కోసం ఎదురుచూస్తున్నాడు. సిమీ సింగ్ భారత్‌కు చెందినవాడే కావడం విశేషం. పంజాబ్‌లో జన్మించాడు.
6 నెలల క్రితం సిమీ సింగ్ తీవ్ర జ్వరంతో బాధపడ్డాడు. డబ్లిన్‌లో ఎన్ని హాస్పిటళ్లు తిరిగినా ఆరోగ్యం కుదుటపడలేదు. దాంతో గత జూన్‌లో భారత్‌కు వచ్చాడు. వచ్చిరావడంతోనే కామెర్ల బారినపడి ఆసుపత్రిలో చేరాడు. అతడికి వైద్య పరీక్షలు చేయగా.. కాలేయం చెడిపోయినట్లు తేలింది. సిమీ సింగ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో.. కుటుంబసభ్యులు రెండు రోజుల క్రితం గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో చేర్చారు. సిమీ సింగ్‌కు వీలైనంత త్వరగా కాలేయ మార్పిడి చేయాలని, లేదా అతడు కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారు. సిమీ భార్య తన కాలేయంలో కొంత భాగం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: The GOAT-MS Dhoni: విజయ్ ‘ది గోట్’లో ఎంఎంస్ ధోనీ.. దద్దరిల్లిపోయిన థియేటర్లు!
సిమీ సింగ్ 1987 ఫిబ్రవరి 4న పంజాబ్‌లోని మొహాలీలో జన్మించాడు. పంజాబ్ తరఫున అండర్-14, అండర్-17 జట్లకు ఆడిన సిమీకి.. భారత్ అండర్-19లో చోటు దక్కలేదు. దాంతో హోటల్ మేనేజ్‌మెంట్ చేసేందుకు ఐర్లాండ్‌కు వెళ్లాడు. 2006లో డబ్లిన్‌లోని ఓ క్రికెట్ క్లబ్‌లో చేరి.. తన ఆటను కొనసాగించాడు. కొద్ది కాలంలోనే ఐర్లాండ్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఐర్లాండ్ తరఫున ఇప్పటివరకు 35 వన్డేలు, 53 టీ20లు ఆడాడు. వన్డేల్లో 39 వికెట్లు, టీ20ల్లో 44 వికెట్లు పడగొట్టాడు. 2021లో దక్షిణాఫ్రికాపై వన్డేలో సెంచరీ బాదాడు.