CR Kesavan: భారతదేశంలో జన్మించిన మొట్టమొదటి గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి మునిమనవడు సిఆర్ కేశవన్ గురువారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ కోసే 2 దశాబ్దాలకు పైగా అంకితభావంతో పనిచేశానని.. కానీ ఇప్పుడు ఆ అవకాశం పార్టీలో ఇవ్వడం లేదని కేశవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ప్రస్తుతం విలువలు లేవని ఆరోపించారు. పార్టీని సేవ చేసినన్ని రోజులు తన ప్రయాణం సవాలుగా, ఆకర్షణీయంగా ఉందని చెప్పారు. తాను కొత్త బాట పట్టాల్సిన సమయం ఆసన్నమైందని, అయితే ఇప్పటి వరకు తాను ఎవరితోనూ మాట్లాడలేదని, తర్వాత ఏం జరుగుతుందో తనకు కూడా తెలియదని కేశవన్ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాసిన లేఖను ట్విట్టర్‌లో పంచుకున్నారు.
Read Also: Peeing Incident in Bus: ఆర్టీసీ బస్సులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన
ఈ లేఖలో కేశవన్ కీలక విషయాలను వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ఛారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తనకు 20 ఏళ్లకు పైగా పార్టీకి సేవ చేసే బాధ్యతలు ఇచ్చినందుకు కాంగ్రెస్‌కు, సోనియా గాంధీకి కేశవన్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, పార్టీలో ప్రతీ ఒక్కరితోనూ తనకు మంచి సంబంధాలు ఉన్నాయని లేఖలో చెప్పుకొచ్చారు. తనకు.. శ్రీపెరంబుదూర్‌లోని రాజీవ్ గాంధీ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్‌మెంట్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా, ప్రసార భారతి బోర్డు సభ్యుడిగా సేవలందించే అవకాశం లభించిందని చెప్పారు. ఇదే సమయంలో తనకు వేరే పార్టీలో చేరే ఆలోచన ప్రస్తుతంలేదని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీపై విమర్శలు చేసి పార్టీని వీడిన ఎకె ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ రాజీనామా చేసిన నెల రోజుల్లోనే ఆయన రాజీనామా చేయడం గమనార్హం.
