Site icon NTV Telugu

CPI Ramakrishna : కాంగ్రెస్‌, సీపీఐ పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది

Ramakrishna On Ucc

Ramakrishna On Ucc

కాంగ్రెస్‌, సీపీఐ పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. ఒక్క పార్లమెంటు, ఎనిమిది అసెంబ్లీ స్థాన్నాల్లో సీపీఐని బలపర్చటానికి కాంగ్రెస్‌ పార్టీ అంగీకారం తెలిపిందని, ఇటీవల హైదరాబాద్‌ నందు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలా నివాసంలో ఇరుపార్టీల మధ్య చర్చలు జరిగాయన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ నుంచి షర్మిలా, సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, కేంద్ర పార్టీ ప్రతినిధి కె.రాజు, సీపీఐ నుంచి రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరావు, కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు పాల్గొన్నారు. ఈ చర్చల్లో ఏ ఏ స్థానాల్లో సీపీఐని కాంగ్రెస్‌ బలపరుస్తుందనే అంశాన్ని ప్రకటించారు. గుంటూరు పార్లమెంటు స్ధానంతో పాటు.. విశాఖపట్నం పశ్చిమ, ఏలూరు, విజయవాడ పశ్చిమ, అనంతపురం, పత్తికొండ, తిరుపతి, రాజంపేట, కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీపీఐ పోటీ చేయనుంది.

అలాగే.. స్థానిక అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న ఇండియా కూటమి అభ్యర్థి రామచంద్రయ్య విజయాన్ని కాంక్షిస్తూ ఈ నెల 5న పత్తికొండలో జరుగుతున్న సీపీఐ జనరల్‌బాడీ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ హాజరవుతారని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య తెలిపారు. బుధవారం స్థానిక సీఆర్‌ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీపీఐ జనరల్‌ బాడీ సమావేశం 5వ తేదీన ఉదయం 10 గంటలకు స్థానిక సీఆర్‌ భవన్‌లో జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాబురావు, ఇండియా కూటమి పార్లమెంటు అభ్యర్థి రాంపుల్లయ్య యాదవ్‌, పత్తికొండ అసెంబ్లీ అభ్యర్థి రామచంద్రయ్య హాజరవుతారని పేర్కొన్నారు. కేంద్రంలో మతతత్వ బీజేపీ నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనకు అంతం పలికేందుకు ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పత్తికొండ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం, సాగునీటి ప్రాజెక్టుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న సీపీఐ అభ్యర్థి రామచంద్రయ్యను ఆదరించి గెలిపించాలని కోరారు.

Exit mobile version