నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కఠినమైన మార్గదర్శకాలను విడుదల చేశారు. వేడుకల పేరుతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా, చట్ట పరిమితులను అతిక్రమించినా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం నుండి నూతన సంవత్సర వేడుకల వరకు కొనసాగేలా భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు.
Waste-to-Energy: వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాలు – ఏపీ డిస్కం మధ్య కుదిరిన ఎంవోయూ
ముఖ్యంగా పబ్బులు, హోటళ్ల యాజమాన్యాలకు కమిషనర్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పబ్బుల్లో గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలు (డ్రగ్స్) దొరికితే యాజమాన్యాలపై అత్యంత తీవ్రమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, సదరు హోటల్ లేదా పబ్బు లైసెన్సులను తక్షణమే రద్దు చేస్తామని ప్రకటించారు. అలాగే, వేడుకల నెపంతో అశ్లీల నృత్యాలకు అనుమతి ఇస్తే నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. నగరంలోని అన్ని పబ్బులు , హోటళ్లలో నిర్వహించే వేడుకలను రాత్రి 1:00 గంటలోపు కచ్చితంగా ముగించాలని ఆదేశించారు. వేడుకల సమయంలో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 15 షీ టీమ్స్‌ను (SHE Teams) రంగంలోకి దించుతున్నట్లు తెలిపారు.
ఇక వాహనదారుల విషయంలో ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తామని సిపి పేర్కొన్నారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి నగరం వ్యాప్తంగా సుమారు 100 కీలక ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నారు. ఈ తనిఖీల కోసం ప్రత్యేకంగా ఏడు అదనపు పోలీస్ ప్లాటూన్లను కేటాయించారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడితే, వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధిస్తారు. అంతేకాకుండా, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వారి డ్రైవింగ్ లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేయాలని రవాణా శాఖకు సిఫారసు చేస్తామని కమిషనర్ హెచ్చరించారు. నగర ప్రజలు బాధ్యతాయుతంగా పండుగలను జరుపుకోవాలని, చట్టాన్ని అతిక్రమించే వారిపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతారని సజ్జనార్ స్పష్టం చేశారు.
Waste-to-Energy: వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాలు – ఏపీ డిస్కం మధ్య కుదిరిన ఎంవోయూ
