Site icon NTV Telugu

CP AV Ranganath : సాహితీ బాధితులకు న్యాయం చేస్తాం

Ranganath

Ranganath

ప్రీ లాంచింగ్ పేరుతో రియల్​ ఎస్టేట్​ సంస్థ సాహితీ ఇన్​ఫ్రా చేసిన వసూళ్ల దందాపై పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫ్లాట్లు నిర్మాణం చేసి ఇస్తామని డబ్బు కట్టించుకుని మోసం చేశారని 2022 ఆగష్టులో సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ భూదాటి లక్ష్మీ నారాయణపై యశ్వంత్‌ కుమార్‌తో పాటు మరో 240 మంది హైదరాబాద్‌ సీసీఎస్​కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎండీ లక్ష్మీ నారాయణను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ సీపీ సీసీఎస్ ఏవీ రంగనాథ్ సోమవారం మాట్లాడుతూ.. సాహితీ బాధితులకు న్యాయం చేస్తామని, సాహితీ కేసులో పారదర్శకంగా దర్యాప్తు చేపడుతామన్నారు.

 

1800కోట్ల మోసం జరిగిందని, స్పెషల్ టీమ్స్ ద్వారా కేసు దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులను అటాచ్ చేస్తామని, మోసపోయిన బాధితులు ఎవరు ఉన్న సీసీఎస్ లో ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేసులను సీసీఎస్ కు బదిలీ చేసేలా చూస్తామని, సాహితీ అన్ని ప్రాజెక్ట్ ల బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని, రెండు నెలల్లో కేసును ఓ కొలిక్కి తీసుకువస్తామన్నారు. సాహితీ లక్ష్మి నారాయణ ద్వార లబ్ది పొందిన వారందరిని విచారిస్తామని, అగ్రిగోల్డ్ ఆస్తుల లాగే హై కోర్టు ఆదేశాలతో సాహితీ బాధితులకు న్యాయం చేస్తామన్నారు సీపీ రంగనాథ్‌.

ఇదిలా ఉండగా.. సాహితీ ఉద్యోగులు ఇచ్చిన రికార్డుల ప్రకారం సాహితీ కృతి బ్లూసమ్‌, సాహితీ సుధీక్ష పేరిట 38 కోట్లు వసూలు చేసిన విషయం పేర్కొనలేదని పోలీసులు వెల్లడించారు. కాగా సైబరాబాద్‌, హైదరాబాద్‌ కమిషనరేట్​తో పాటు మెదక్‌ జిల్లా పరిధిలో సాహితి ఇన్‌ఫ్రా వెంచర్స్ ఇండియా ప్రై లిమిటెడ్​పై పలు ఠాణాల్లో నమోదైన 41 కేసులను 2023 సెప్టెంబర్‌లో హైదరాబాద్ సీసీఎస్‌కు బదిలీ చేశారు. దీంతో ఇప్పటివరకు సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, డైరెక్టర్లపై మొత్తంగా 50 కేసులు నమోదయ్యాయి.

Exit mobile version