Site icon NTV Telugu

Kakani Govardhan Reddy: పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.. వైసీపీ నేతల హెచ్చరిక!

Kakani Govardhan Reddy Arrest

Kakani Govardhan Reddy Arrest

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేయడంపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాణికి హాని తలపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అరెస్ట్‌లతో వైసీపీని అణగదొక్కాలని చూస్తే ప్రజల నుంచి తిరిగుబాటు తప్పదన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి ప్రతిపక్షంపై కక్ష్య పూరితంగా వ్యవహారిస్తోందని మండిపడ్డారు. కాకాణిని అదుపులోకి తీసుకోవడంపై నెల్లూరు జిల్లా పోలీసులు అధికారిక ప్రకటన చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.

క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం తదితర అభియోగాలపై శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసు స్టేషన్‌లో కాకాణి గోవర్ధన్‌ రెడ్డిపై కేసు నమోదయింది. ఈ కేసులో నాలుగో నిందితుడి (ఏ4)గా ఉన్నారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు పలుమార్లు నోటీసులిచ్చినా.. కాకాణి వాటిని బేఖాతరు చేశారు. అరెస్టు తప్పదని గ్రహించిన తర్వాత అజ్ఞాతంలో ఉండి.. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ముందస్తు బెయిల్‌ పిటిషన్లు వేసిన నిరాశ తప్పలేదు. గత రెండు నెలలుగా పరారీలో ఉన్న కాకాణి.. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు హైదరాబాద్‌లోని పలుచోట్ల తలదాచుకున్నారు. చివరకు బెంగళూరు సమీపంలోని ఓ పల్లెటూరిలోని రిసార్ట్‌లో ఉన్నట్లు తెలుసుకున్నా పోలీసులు ఆదివారం సాయంత్రం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

Also Read: Pawan Kalyan: నేడు చెన్నైలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన!

కాకాణి గోవర్ధన్‌ రెడ్డిని అదుపులోకి తీసుకోవడంపై వైసీపీ నేతల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంకు మాజీ మంత్రి అనిల్, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరీగా మురళి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాకాణి అరెస్ట్‌పై వైసీపీ నేతల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాజీ మంత్రి కాకాణిని హాని తలపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అరెస్ట్‌లతో వైసీపీని అణగదొక్కాలని చూస్తే ప్రజల నుంచి తిరిగుబాటు తప్పదు. కుట్రలతో నిరాధారమైన కేసులు పెడుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి ప్రతిపక్షంపై కక్ష్య పూరితంగా వ్యవహారిస్తోంది. కాకాణికి జిల్లా పార్టీ అండగా ఉంటుంది. కాకాణిని అదుపులోకి తీసుకోవడంపై జిల్లా పోలీస్ ప్రకటన చేయాలి’ అని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.

Exit mobile version