Site icon NTV Telugu

Congress President Election : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక పోలింగ్.. ఓటేసిన సోనియా, ప్రియాంక

Sonia

Sonia

Congress President Election : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా 65 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 137 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీ చరిత్రలో అధ్యక్ష పదవికి ఎన్నిక జరగడం ఇది ఆరోసారి. 9 వేల మందికిపైగా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ) ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అధ్యక్ష ఎన్నికల బరిలో పార్టీ సీనియర్‌ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్‌ ఉన్నారు. 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో, ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో పోలింగ్ జరుగుతోంది. భారత్ జోడో యాత్ర క్యాంప్‌లో కూడా పోలింగ్​కు ఏర్పాట్లు చేశారు.ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో, దేశవ్యాప్తంగా 65 పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ జరుగుతుంది. నేడు పోలింగ్ జరుగుతుండగా.. ఈ నెల 19న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Read Also: Sitrang Cyclone: ‘సిత్రాంగ్’ వచ్చేస్తోంది.. తస్మాత్ జాగ్రత్త

కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఓటు వేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక నేపథ్యంలో.. నేడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు విరామం ఇచ్చారు. రాహుల్ గాంధీ కర్ణాటకలోని భారత్ జోడో యాత్ర క్యాంప్‌సైట్‌లో ఓటు వేయనున్నారు. పీసీసీ ప్రతినిధులైన 40 మంది కూడా అక్కడే ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Read Also: UK PM: లిజ్ ట్రస్ పై అవిశ్వాసానికి రంగం సిద్ధం

శశి థరూర్ తిరువనంతపురంలోని కేరళ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో, ఖర్గే బెంగళూరులోని కర్ణాటక కాంగ్రెస్ కార్యాలయంలో ఓటు వేయనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో గాంధీ కుటుంబం మద్దతు మల్లికార్జున ఖర్గేకే ఉందన్న సంకేతాల నేపథ్యంలో.. ఆయన గెలుపు ఖాయంగా కనిపిస్తుంది. అయితే నేడు శశిథరూర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పునరుజ్జీవనం ప్రారంభమైందని తాను నమ్ముతున్నానని చెప్పారు. ఈరోజు మల్లికార్జున ఖర్గేతో మాట్లాడానని.. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా తాము సహచరులుగా, స్నేహితులుగా ఉంటామని తెలిపారు.

Exit mobile version