ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. ప్రజల్ని తమవైపు ఆకర్షించేందుకు రకరకాల హామీలు గుప్పిస్తున్నాయి. యూపీలో తమ పార్టీకి ఓటువేసి గెలిపిస్తే విద్యార్థినులకు స్మార్ట్‌ఫోన్లు, ఈ-స్కూటర్లు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ యూపీ ప్రజలకు మరో కీలక హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో తమ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే ప్రజలందరికీ 10లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు నాణ్యమైన, చౌకగా వైద్య చికిత్స అందించే అంశాన్ని తమ మేనిఫెస్టోలో పెట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. కరోనా సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ ఎంత దుర్భరంగా ఉందో అంతా చూశామన్నారు. ఇప్పుడు జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని పేర్కొన్నారు. తమ పార్టీని గెలిపిస్తే ఏ వ్యాధికైనా రూ.10లక్షల వరకు ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు.