Uttamkumar Reddy: పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా ప్రారంభించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు నల్గొండ ఎంపీ, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత ఉస్తేల వీరారెడ్డి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న ఆయన… పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై స్పందించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 ప్రకారం ఉభయ సభలకు రాష్ట్రపతి అధ్యక్షత వహిస్తారని….. కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభిస్తే రాజ్యాంగ స్ఫూర్తికి సార్ధకత ఉంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సమకాలీన రాజకీయాల్లో రాజకీయ పార్టీలలో క్రమశిక్షణ తగ్గినా, అవినీతి పెరిగినా కమ్యూనిస్టు పార్టీలలో మాత్రం సిద్ధాంతాలు, నైతికత అలాగే ఉండిపోయాయని.. తాను కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలను ఫాలో అవుతానని.. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
Read Also: CM KCR: దశాబ్ధి ఉత్సవాల ఖర్చులకు కలెక్టర్లకు రూ.105 కోట్లు విడుదల
ఇదిలా ఉండగా.. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభంపై పెద్ద రగడే లేచింది. వీర్ సావర్కర్ పుట్టిన రోజైన మే 28న పార్లమెంట్ ప్రారంభోత్సవం చేస్తుండడం పట్ల తొలుత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విపక్షాలు.. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించడంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. రాజ్యాంగానికి అధిపతి అయిన రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగాలని, కానీ అందుకు విరుద్ధంగా ప్రధానమంత్రి ప్రారంభించడమేంటని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే 19 విపక్ష పార్టీలు పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాయి. అయితే వీరికి అధికారపక్షంలోని నేతలు సైతం గట్టి కౌంటరే ఇస్తున్నారు.