Adhir Ranjan Chowdhury: కాంగ్రెస్ ఎంపీ అధిర్ రాజన్ చౌదరి సస్పెన్షన్‌ను లోక్‌సభ ప్రివిలేజెస్ కమిటీ రద్దు చేసింది. బుధవారం కాంగ్రెస్ ఎంపీ పార్లమెంటరీ కమిటీ ముందు హాజరైన తర్వాత సస్పెన్షన్‌ను రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. మణిపూర్ హింసాకాండపై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ‘వికృతంగా ప్రవర్తించినందుకు’ కాంగ్రెస్ నాయకుడిని ఆగస్టు 11న సస్పెండ్ చేశారు. అధిర్ రంజన్ చౌదరి ప్రధాని నరేంద్ర మోడీని ధృతరాష్ట్రునితో పోల్చారు. ఈ క్రమంలో ఆయనపై లోక్‌సభ స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు.
లోక్‌సభ ప్రివిలేజెస్ కమిటీ ముందు హాజరైన అధిర్ రంజన్ చౌదరి.. ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం లేదని అన్నారు. వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటు లోపల తాను చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన విచారం వ్యక్తం చేశారు. బీజేపీ సభ్యుడు సునీల్ కుమార్ సింగ్ అధ్యక్షతన ఉన్న పార్లమెంటరీ ప్యానెల్ కమిటీ లోక్‌సభ స్పీకర్‌కు నివేదికను సమర్పించనుంది. ఆగస్టు 18న జరిగిన కమిటీ సమావేశంలో అధిర్ రంజన్ చౌదరి తన ప్రవర్తనకు లోక్‌సభలో శిక్షించబడ్డారని, పార్లమెంటరీ ప్యానెల్ ద్వారా ఆయన ప్రవర్తనను పరిశీలించాల్సిన అవసరం లేదని పలువురు సభ్యులు అభిప్రాయపడ్డారు.
అధిర్ రంజన్ చౌదరి సస్పెన్షన్ కోసం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టిన తీర్మానంలో.. “సభ, అధ్యక్షుడి అధికారాన్ని పూర్తిగా విస్మరిస్తూ స్థూలమైన, ఉద్దేశపూర్వక, పదేపదే దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని” ఆరోపించారు.