Site icon NTV Telugu

Kodanda Reddy: తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది..

Kodanda Reddy

Kodanda Reddy

Kodanda Reddy: రాష్ట్రంలో భూములు, భూరికార్డులు కీలకమైనవని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని.. అధికారులు రికార్డులు సరిగా లేకుండా చేశారని ఆయన ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వంలో దేశంలో భూ రికార్డులు సర్వే చేయాలని ఉద్దేశించగా.. కేంద్రం నుంచి ముఖ్యమంత్రి డబ్బులు తెచ్చుకున్నారని.. కానీ ఎక్కడ కూడా ఇంత వరకు సర్వే చేయలేదని ఆయన అన్నారు. ఎన్నికల కోసం ముఖ్యమంత్రి హడావిడి చేస్తున్నారు కానీ.. ఇక్కడ ఒక ఎకరా కూడా సర్వే జరగలేదన్నారు.

ఏపీలో జులై 1 నుంచి భూ సర్వే జరుగుతోందని.. డ్రోన్ ఫొటోల ద్వారా గ్రామ నక్ష కూడా పూర్తయిందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి రెవెన్యూ రికార్డులు సరిదిద్దడం కోసం 2లక్షల సిబ్బందిని నియమించారన్నారు. తెలంగాణలో పూర్వీకులు సంపాదించుకున్న భూమి కూడా ఇంత వరకు ఖాతాలో ఎక్కలేదన్నారు. కానీ ఆంధ్రాలో పట్టాదారు పాసుపుస్తకంలో అన్ని వివరాలు నమోదు చేస్తున్నారన్నారు. దేశంలో తొలిసారి యూపీఏ ప్రభుత్వం టైటిల్ గ్యారంటీ చట్టం తేవాలని ముసాయిదా చేసిందని ఆయన తెలిపారు. ఏపీ ప్రభుత్వం మొదటిసారి ఈ చట్టాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి పంపారని వెల్లడించారు. కౌలు చట్టాన్ని ఉమ్మడి రాష్ట్రంలో 2006లోనే కాంగ్రెస్ తెచ్చిందన్నారు. ఏపీలో గతంలో ఉన్న చట్టాన్ని రద్దు చేసి గ్రామ సచివాలయంలోనే వ్యవస్థని ఏర్పాటు చేశారన్నారు.

Telangana: కోడలు అకాల మరణం.. తట్టుకోలేక గుండెపోటుతో వృద్ధుడు మృతి

కౌలుకు తీసుకున్నవారు గ్రామ సచివాలయంలో దరఖాస్తు పెట్టుకుంటే రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలు అందుతున్నాయన్నారు. ఇందిరా గాంధీ భూ సంస్కరణలు చేసి భూములు పంపిణీ చేసింది.. 2006లో కూడా 6 లక్షలకు పైగా ఎకరాలకు కాంగ్రెస్ పట్టా ఇచ్చిందన్నారు. అసైన్డ్ భూమికి కూడా పట్టాలు ఇచ్చేలా రెవెన్యూ మినిస్టర్ అధ్యక్షతన ఏపీలో ఒక కమిటీ వేశారని ఆయన పేర్కొన్నారు. 2 లక్షల 70 వేల ఎకరాల అటవీ పోడు భూములు ఏపీలో ఉన్నాయని.. 2006 అటవీ చట్టాన్ని అమలు చేసి అక్కడ వారికి భూమిపై హక్కులు కల్పించారన్నారు. తెలంగాణలో ధరణి పోర్టల్ ఏర్పాటు చేసి విదేశాల్లో దివాలు తీసిన ఓ కంపెనీకి ధరణి నిర్వహణను అప్పగించారని కోదండరెడ్డి విమర్శించారు. ఏపీలో భూరికార్డులు ప్రభుత్వమే నిర్వహిస్తుందన్నారు. 2017 డిసెంబర్‌లో భూ రికార్డుల సవరణ చట్టాన్ని తెలంగాణలో తెచ్చారని.. 5 ఏళ్ళు గడిచినా 20 లక్షల కుటుంబాలకు భూమి హక్కు లభించలేదని ఆయన మండిపడ్డారు.

రెవెన్యూ వ్యవస్థను విదేశాల్లో పెట్టి ప్రగతి భవన్‌లో కీ ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు. ఇక్కడ కౌలు రైతు చట్టాన్ని ఎత్తేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఇందిరాగాంధీ ఇచ్చిన అసైన్డ్ భూములు వేలం వేసి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పోడు భూములపై ఇంత వరకు రిపోర్ట్ బయటకు రాలేదన్నారు. ముఖ్యమంత్రికి ఎన్నికలే ముఖ్యం.. వ్యవసాయ రంగాన్ని చిన్నాభిన్నం చేశారని కోదండరెడ్డి మండిపడ్డారు.

Exit mobile version