NTV Telugu Site icon

Congress: ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం.. రాహుల్ అంశంపై చర్చ

Rahei

Rahei

ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి సోనియా, రాహుల్, ప్రియాంక పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు చోట్ల నుంచి పోటీ చేసి గెలిపొందారు. రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి గెలిచారు. దీంతో ఈ రెండు స్థానాల్లోంచి ఏదో ఒక స్థానాన్ని రాహుల్ వదులుకోనున్నారు. ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈరోజే లోక్‌సభ సచివాలయానికి సమాచారం అందించాలి. ఈ నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మరికాసేపట్లో కీలక ప్రకటన వెలువడనుంది. ఇదిలా ఉంటే ఈసారి లోక్‌సభలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా దక్కింది. ఈ పదవిని రాహుల్‌కి అప్పగించాలని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ రాహుల్ మాత్రం ఆ పదవి తీసుకునేందుకు నిరాకరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరి కాసేపట్లో తేలిపోనుంది.

ఇదిలా ఉంటే రాహుల్ వయనాడ్ స్థానం వదులుకోనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ రెండు స్థానాల నుంచి కూడా భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే రాయ్‌బరేలీ అనేది కాంగ్రెస్‌కు కంచుకోటలాంటిది. ఫిరోజ్‌గాంధీ దగ్గర నుంచి కాంగ్రెస్సే గెలుస్తోంది. కాబట్టి ఈ స్థానాన్ని రాహుల్ అంటుపెట్టుకుని ఉండాలని చూస్తున్నారు. ఇక ప్రియాంక కూడా ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ వయనాడ్ వదులుకుంటే.. బైపోల్‌లో వయనాడ్ నుంచి ప్రియాంక రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.