NTV Telugu Site icon

Khairatabad: ఖైరతాబాద్‌లో గెలుపెవరిది..? ఆ సక్తి రేపుతోన్న సర్వే రిపోర్ట్..!

Vijaya Reddy

Vijaya Reddy

Khairatabad: తెలంగాణ ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు వాడివేడి జరుగుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదని కొందరు అంచనా వేస్తుంటే.. మరోవైపు.. ఈసారి తెలంగాణలో విజయం మాదే అంటోంది బీజేపీ.. రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రాబోతోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నమాట.. అధికార పార్టీకి చెక్ పెట్టేలా ఓవైపు హస్తం పార్టీ నేతలు.. మరోవైపు బీజేపీ నేతలు ముందుకు సాగుతున్నారు. ఇక, ఎన్నికల ఫలితాలపై రకరకాల సర్వేల ఫలితాలు కూడా వెలువడ్డాయి.. కొన్ని సర్వేలు మళ్లీ కారు జోరు చూపిస్తుంది అంటుంటే.. మరికొన్ని సర్వేలు ఈ సారి హస్తం హవా నడుస్తుందంటున్నారు.. ఇంకా కొన్ని సర్వేలు కమలం వికసించనుంది అంటున్నాయి.. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? అనే దానిపై ఓ సంస్థ సర్వే నిర్వహించిందట.. దీంతో.. ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.

ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపున సీనియర్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ నుంచి పి. విజయారెడ్డి, బీజేపీ తరపున చింతల రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. వీరిలో ఎవరికి ఓటు వేస్తారనే దానిపై ఒక సర్వే సంస్థ ప్రజలను ఆరా తీసిందట.. అయితే, మెజార్టీ ప్రజలు విజయారెడ్డి వైపే మొగ్గుచూపారని ఆ సర్వే రిపోర్ట్‌ పేర్కొందని.. ఖైరతాబాద్‌ స్థానం కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలో పడుతుందని ఆ సర్వే సంస్థ వెల్లడించిందని పార్టీ శ్రేణులు, విజయారెడ్డి అనుచరులు చెబుతున్నారు.

దివంగత నేత పి.జనార్థన్ రెడ్డి అలియాస్ పీజేఆర్ కుమార్తెగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయారెడ్డి.. అనతికాలంలోనే తండ్రికి తగ్గ కూతురిగా పేరు తెచ్చుకున్నారు. మధ్యలో కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరిన ఆమె జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బరిలోకి దిగి కార్పొరేటర్‌గా విజయం సాధించారు.. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరారు.. ఆమెపై నమ్మకంతో ఖైరతాబాద్‌ నుంచి బరిలోకి దింపింది కాంగ్రెస్‌ పార్టీ.. తన తండ్రి గతంలో విజయం సాధించిన నియోజకవర్గం కావడం.. అక్కడి ప్రజలను ఆమెకు అనుబంధం కూడా ఉండడంతో.. పేదల కోసం నిరంతరం పోరాడుతూ తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న విజయారెడ్డికి సానుకూల పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు ఆమె అనుచరులు.. ఏ పార్టీలో ఉన్నా ప్రజల క్షేమం కోసమే నిరంతరం పనిచేస్తున్నారనే పేరు సంపాదించుకున్నారు.. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న ఆమెను ప్రజలు దీవిస్తున్నారని.. ఈ సారి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తామని ప్రజలు హామీ ఇస్తున్నారని అమె ఫాలోవర్స్‌ చెబుతున్నమాట..

అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న విజయారెడ్డి ఈసారి ఎమ్మెల్యేగా గెలుస్తారని కొన్ని సర్వే ఏజెన్సీలు చెబుతున్నాయని.. అది నిజం కాబోతుంది అంటున్నారు విజయారెడ్డి అనుచరులు.. మరి వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నియోజకవర్గం నుంచి విజయం సాధించేది ఎవరు? ఆ సర్వే నివేదిక చెబుతున్నట్టు విజయారెడ్డి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారా? మరోసారి దానం విజయం సాధిస్తారా? లేదా చింతల సత్తా చూపించనున్నాడా? అనేది వేచి చూడాల్సిన విషయమే.. కానీ, సర్వే రిపోర్టులు, ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే.. విజయారెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం అంటున్నారు ఆమె ఫాలోవర్స్‌.