NTV Telugu Site icon

BJP vs Congress: నిప్పు రాజేసిన ఈటల కామెంట్స్.. భాగ్యలక్ష్మి గుడి వద్ద ప్రమాణానికి రేవంత్ రె’ఢీ’..

Revanth Reddy

Revanth Reddy

BJP vs Congress: తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కమలం పార్టీగా మారాయి. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు సవాల్‌ విసురుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్య లు తీవ్ర దుమారం రేపుతున్నా యి. మునుగోడు ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్‌కు రూ.25 కోట్లు ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ తన ఆరోపణలను నిరూపించుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి సవాల్ విసిరారు. చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద ప్రమాణానికి రేవంత్‌ రెడ్డి సిద్దమయ్యారు. కాగా, భాగ్యలక్ష్మి ఆలయానికి ఈటల రాజేందర్ రావాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయానికి బయలుదేరారు. అన్ని విషయాలు అమ్మవారి ఆలయం వద్దే మాట్లాడుతానని అన్నారు. ఆరోపణలు చేసేవారు భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలని సవాల్‌ విసిరారు.

ఇదిలా ఉండగా ఈ వివాదంపై బీజేపీ నేత డీకే అరుణ స్పందించారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు నగదు తీసుకున్నారని ప్రజలు అనుకుంటున్నారని.. ఈటల చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదా అని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు ఒకటే అని ఎన్నోసార్లు రుజువైందని, అది ప్రజలకు బహిరంగంగా ఈటల రాజేందర్ చెబితే అంత రోషం ఎందుకని ఆమె అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, బడుగు బలహీనవర్గాల నాయకుడిని విమర్శిస్తే బీజేపీ చూస్తూ ఉండదని హెచ్చరించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒప్పందం చేసుకున్నాయన్న విషయం గతంలో రుజువైందని తెలిపారు. అందుకు హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికలే దానికి నిదర్శనమని చెప్పారు. గల్లీలోనే కాదు.. దిల్లీలోనూ లేని పార్టీ కాంగ్రెస్ అని ఘాటుగా స్పందించారు. “ఓటుకు నోటు వ్యవహారంపై రేవంత్‌ ప్రమాణం చేస్తారా?. ఈటల రాజేందర్‌ చెప్పింది నూటికి నూరు శాతం నిజం. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌ సహకరించింది. దుబ్బాక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒక్కటైన మాజ నిజం కాదా? వాస్తవం చెబితే రేవంత్‌కు ఎందకంత ఉలికిపాటు అంటూ..” డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read Also: Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. మూడు రోజులు వానలే..

ఈ వ్యవహారం మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ గ‌త చ‌రిత్ర ప్రజ‌లంద‌రికీ తెలిసిందేనని, ప‌బ్లిక్‌లో రేవంత్‌కు బ్లాక్ మెయిల‌ర్ అనే పేరుందని ఆయన ఆరోపించారు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక ప‌ద‌వుల‌ను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్లు దోచుకున్న రేవంత్.. ఇప్పుడు భాగ్యల‌క్ష్మి గుడి వ‌ద్ద ప్రమాణాలంటే న‌మ్మేదెవ‌రని ఆయన విమర్శలు గుప్పించారు. లెక్కలేన‌న్ని త‌ప్పుడు ప‌నులు చేస్తున్న రేవంత్ భాగ్యల‌క్షి గుడిలో అడుగు పెడితే, ఆ దేవాల‌యం అప‌విత్రం అవుతుంద‌నేది భ‌క్తుల భావ‌న‌. ఈటెల రాజేందర్, తాను ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి పార్టీ మారామే కానీ నీ మాదిరిగా ఒక పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవితో మరో పార్టీలో చేరలేదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత‌తో కలిసి వ్యాపార లావాదేవీలు చేసింది వాస్తవం కాదా, ఆమెతో నీకు వ్యాపార‌ భాగస్వామ్యం లేదా అంటూ రాజగోపాల్‌ రెడ్డి ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో ల‌క్షల రూపాయ‌ల నోట్ల క‌ట్టల‌తో రెడ్ హాండెడ్‌గా దొరికి జైలుకు వెళ్లిన నీ చరిత్ర అందరికీ తెలుసంటూ మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి 25 కోట్లు కాంగ్రెస్‌కు ముట్టాయని, అయితే అందులో ప‌ది కోట్లు రేవంత్ నొక్కేసాడని కాంగ్రెస్ నేతలే అంతర్గతంగా మాట్లాడుకుంటున్న విష‌యం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మునుగోడులో బిజెపి గెలిస్తే తెలంగాణ‌లో కాంగ్రెస్ ప‌త‌న‌మ‌వుతుంద‌ని, అందుకే న‌న్ను ఓడించేందుకు బీఆర్ఎస్‌తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని ఆ పార్టీని గెలిపించలేదా అంటూ రాజగోపాల్‌ రెడ్డి ఆరోపణలు చేశారు.

మరోవైపు, బీజేపీ నేతల ఆరోపణలపై కాంగ్రెస్‌ నేత పాల్వాయి స్రవంతి ఫైర్‌ అయ్యారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ చేతిలోనే ఉన్నాయని ఆమె మాట్లాడారు. కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌ రూ.25 కోట్లు ఇస్తే ఏం చేస్తున్నారని బీజేపీ నేతలను ప్రశ్నించారు. బీజేపీలోకి చేరికలు లేకపోవడంతో ఈటల రాజేందర్‌ ఆవేదనలో ఉన్నారంటూ పాల్వాయి స్రవంతి ఘాటుగా విమర్శలు చేశారు.