Site icon NTV Telugu

PM Modi: కాంగ్రెస్ నన్ను 91 సార్లు ధూషించింది.. ప్రతిపక్షంపై భగ్గుమన్న మోదీ

Pm Narendra Modi

Pm Narendra Modi

PM Modi: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వేగం పెంచారు. ఎన్నికల ప్రచారంలో విపక్ష కాంగ్రెస్‌పై ఆయన మండిపడ్డారు. విపక్ష పార్టీ ఇప్పటివరకు తనను 91 సార్లు దూషించిందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. అలా చేసిన ప్రతీసారి ఆ పార్టీ కుప్పకూలిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో కర్ణాటక పూర్తిగా నష్టపోయిందని చెప్పుకొచ్చారు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. కానీ తాను మాత్రం కర్ణాటక ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానన్నారు. కర్ణాటకలో బీదర్ జిల్లాలోని హమ్నాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. ఈ వ్యాఖ్యలు చేశారు. వారు లింగాయత్ వర్గాన్ని నిందించారని.. అంబేడ్కర్,వీర్‌ సావర్కర్‌ను అవమానించారని.. వారి నిందలకు ప్రజలు ఓట్లతో బదులిస్తారని ప్రధాని మోదీ అన్నారు.

బీజేపీపై ఎంత బురదజల్లితే.. కమలం అంతగా వికసిస్తుందని కార్యకర్తలనుద్దేశించి ప్రధాని మోదీ అన్నారు. కర్ణాటకలో జరుగుతున్న శాసనసభ ఎన్నికలు కేవలం ఐదేళ్ల ప్రభుత్వం ఏర్పాటుకు కాదని.. దేశంలో ఆ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడం కోసమని ప్రధాని చెప్పుకొచ్చారు. కర్ణాటకలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ సిద్ధమైందని ఆయన తెలిపారు. కన్నడ రైతులు, ప్రజలకు కాంగ్రెస్ బూటకపు వాగ్దానాలు మాత్రమే చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంతో పోలిస్తే బీజేపీ హయాంలో విదేశీ పెట్టుబడులు మూడు రెట్లు పెరిగాయన్నారు. కర్ణాటకలో రెట్టింపు వేగంతో రెండంకెల అభివృద్ధి జరుగుతోందని మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే.. రాష్ట్రం డబుల్‌ స్పీడ్‌ దూసుకెళ్తుందన్నారు.

Read Also: Karnataka : ‘సోనియా గాంధీ పాకిస్తాన్, చైనా ఏజెంట్’..బీజేపీ ఎమ్మెల్యే

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఓ విష సర్పం లాంటివారు. ఆయన తెచ్చిన పథకాలు చూసేందుకు ఆకర్షణీయంగా ఉన్నాయని రుచి చూస్తే చావు తప్పదని విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన తన మాటల ఉద్దేశం వేరని వివరణ ఇచ్చుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విష సర్పమని తాను అనలేదని.. ఆ పార్టీ విధానాలు విషపూరితమని మాత్రమే అన్నానని ఖర్గే వివరించారు. ఈ వ్యాఖ్యలకు బదులుగా ఇవాళ కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ తమ వాగ్బాణాలతో విరుచుకుపడినట్లుగా తెలుస్తోంది.

Exit mobile version