Visakha Central Jail: గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆగడం లేదు. రోజు రోజుకూ గంజాయి అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఎంతలా అంటే.. ఏకంగా సెంట్రల్ జైలులో అమ్మకాలు జరిగేంతగా పెరిగిపోయాయి. విశాఖపట్నంలోని సెంట్రల్ జైలులో మత్తు పదార్థాలు కలకలం సృష్టించాయి. గంజాయి, గుట్కాలు గుట్టు చప్పుడు కాకుండా ఖైదీలకు చేరవేస్తున్న నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. చాలా కాలంగా ఖైదీలకు మత్తు పదార్థాలు చేరవేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: CM Jagan Tour: నేడు సీఎం జగన్ విజయవాడ పర్యటన
సెంట్రల్ జైలులో ఖైదీలకు మత్తు పదార్థాలను చేరవేస్తున్న మైలపల్లి ఎల్లాజీని సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మత్తు పదార్థాలను బాల్స్‌లాగా చుట్టి జైలు గోడ మీద నుంచి విసరడం ద్వారా ఖైదీలకు నిందుతుడు చేరవేస్తున్నాడు. చాలా కాలంగా నిందితులను పట్టుకోవాలని వేచిచూస్తున్న పోలీసులు.. ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. అతడిని పట్టుకోవడం కోసం నిఘా పెట్టిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. ఆరిలోవ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి 14 రోజులు రిమాండ్ విధించారు.
ఈ నేపథ్యంలో గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు విక్రయించినా, రవాణా చేసినా, సేవించినా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబమని పోలీసులు హెచ్చరించారు. స్వలాభం కోసం ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించే గంజాయి అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందన్నారు. ఎవరైనా పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
