NTV Telugu Site icon

Cockroach in Mutton Soup : మటన్‌ సూప్‌ ఆర్డర్ చేస్తే.. బొద్దింక సూప్‌ వచ్చిందేంటీ..?

Cockroach In Mutton Soup

Cockroach In Mutton Soup

Cockroach in Mutton Soup : రోజు రోజుకు హైదరాబాద్‌లో ఆహార పదార్థాల నాణ్యత తగ్గుతోంది. ఇప్పటికే గ్రేటర్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ నాణ్యత ప్రమాణాలు పాటించని రెస్టారెంట్లను సీజ్‌ చేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని రెస్టారెంట్ల యాజమాన్యాల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా అహార పదార్థాల నాణ్యత లోపించిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని సైనిక్‌పురిలో ఉన్న అరేబియన్‌ మంది రెస్టారెంట్‌కు ఓ కస్టమర్‌ వెళ్లాడు. ఆకలి మీదున్న ఆ కస్టమర్‌ మటన్‌ సూప్‌ను ఆర్డర్‌ చేసి వేయిట్‌ చేస్తున్నాడు. ఇంతలో తను ఆర్డర్‌ ఇచ్చిన సూప్‌ వచ్చింది. ఆవురావురుమని తిన్నేద్దామనుకున్న తనకు అంతలోనే షాక్‌ తగిలింది. మటన్‌ సూప్‌లో చెంచా పెట్టిచూస్తే మటన్‌కు బదులు బొద్దింక దర్శనమిచ్చింది. దీంతో అవాక్కైన కస్టమర్‌ రెస్టారెంట్‌ యాజమాన్యం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాడు.

వాళ్లు దాన్ని చూసి మామూలుగానే రెస్పాన్స్‌ ఇచ్చారు. దీంతో మరింత ఖంగుతిన్నాడు కస్టమర్‌ రోహిత్. అయితే.. ఈ ఘటనకు సంబంధించి వీడియోను సామాజిక కార్యకర్త రాబిన్ జక్కీయస్ సోషల్ మీడియా వేదికగా స్పందించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అహార భద్రతకు సంబంధించి ఇటువంటి ఉదంతాలు పెరిగిపోతుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెస్టారెంట్‌లు పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులను, సంబంధిత శాఖలను కోరారు.

అయితే.. అహార భద్రతకు సంబంధించిన ఫిర్యాదులను GHMC కి తెలియజేయాలనుకునే వారు foodsafetywing.ghmc@gmail.com అనే మెయిల్ ఐడీకి పంపించవచ్చు. అలాగే, 040-21111111 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా X (ట్విట్టర్) ద్వారా GHMC అధికారులకు తమ సమస్యలను తెలియజేయవచ్చు. ఇలాంటి ఘటనలు మళ్లీ చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని నగరవాసులు అధికారుల్ని డిమాండ్ చేస్తున్నారు. రెస్టారెంట్‌లు కఠినమైన పరిశుభ్రతా నిబంధనలు పాటించాలని, నాణ్యమైన ఆహారం అందించాల్సిన బాధ్యత తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.