NTV Telugu Site icon

CM YS Jagan: పేదలకు మేలు చేశానని అనిపిస్తేనే ఓటు వేయండి..

Cm Ys Jagan At Kandukuru

Cm Ys Jagan At Kandukuru

CM YS Jagan: రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతోందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్లు మీ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని.. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపేనని విమర్శించారు. చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్ళీ మోసపోవడమేనని ఆరోపించారు. చంద్రబాబును నమ్మితే పులి నోట్లో తల పెట్టడమేనన్నారు. ఎన్నికలు వస్తున్నాయని మన రాష్ట్రానికి వచ్చిన నాయకులని చూస్తే సుమతీ శతకం పద్యాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. ఎన్నికల కోసం ఇక్కడకు వచ్చిన నేతలు.. ఓడితే తిరిగి ఎక్కడకు వెళ్తారో అందరికీ తెలుసన్నారు. ఈ నాన్ లోకల్ కిట్టీ పార్టీ సభ్యులకు.. ఈస్ట్ ఇండియా కంపెనీ సభ్యులకు రాష్ట్రాన్ని దోచుకోవడమే పని అని విమర్శలు గుప్పించారు. నేను చంద్రబాబు లాగా సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను అని బడాయిలు చెప్పడం లేదని.. గత ఐదేళ్లలో కొత్తగా ఐదారు వ్యవస్థలు తీసుకు వచ్చి మీకు చూపించగలిగానన్నారు. ప్రతీ పేద ఇంటికి వెళ్లి అందించే పౌర సేవలు.. నాడు నేడుతో మారిన గవర్నమెంట్ బడులు.. ప్రతీ గ్రామంలో విలేజ్ క్లినిక్ లు.. ఆర్బీకే.. మహిళా పోలీస్.. డిజిటల్ లైబ్రరీ.. మీ కళ్ళ ముందే ఈ వ్యవస్థలు కొనసాగాలంటే నాకు మన పార్టీకి ఓటు వేయాలని సూచించారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా అమ్మఒడి.. మీ పిల్లలకు మరో ఐదేళ్లు చదివించాలని మీకు ఉంటే మమ్మల్ని ఆదరించాలని ప్రజలను కోరారు. పేదలకు మేలు చేశానని మీకు అనిపిస్తేనే ఓటు వేయాలని కోరారు.

Read Also: Andhra Pradesh: తనిఖీల్లో.. 14 కోట్ల విలువైన 66 కేజీల బంగారం పట్టివేత

అక్కాచెల్లెమ్మల బాగోగుల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని.. ఈ 58 నెలల కాలంలో గతంలో ఎప్పుడు చూడని విధంగా కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇక మీదట ఈ పథకాలు కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కి మీ బిడ్డకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు మార్కు దోపిడీ సామ్రాజ్యం.. జన్మభూమి కమిటీ మాదిరి దోపిడీ లేకుండా ఉండాలంటే వైసీపీకి ఓటు వేయాలన్నారు. లంచాలు, అవినీతి లేని సంక్షేమ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. 2.70 లక్షల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేశామని సీఎం తెలిపారు. కూటమికి ఓటు వేస్తే డీబీటీ లో దత్తపుత్రుడికి, వదినమ్మకు ప్యాకేజీలు వెళ్తాయని ఎద్దేవా చేశారు. ఇదే రాష్ట్రం.. ఇదే బడ్జెట్.. అప్పుడు కూడా ఇవే డబ్బుతో మీకు ఎలా పంపించగలిగానో ఆలోచన చేయాలన్నారు. చంద్రబాబు మోసాలకు, ప్రలోభాలకు లొంగి మోసపోవద్దని సూచించారు.

2014లో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, ఇదే కూటమి ప్రతీ ఇంటికి పంపిన పాంప్లీట్ అందరూ గుర్తుంచుకోవాలన్నారు. అప్పుడు ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా వారు నెరవేర్చారా అంటూ ప్రశ్నించారు. “అప్పుడు హామీ ఇచ్చిన రైతు రుణమాఫీ అన్నారు.. చేశారా.. చంద్రబాబు రద్దు చేస్తామన్న పొదుపు సంఘాల రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతున్నా.. ఆడబిడ్డ పుట్టగానే 25 వేలు డిపాజిట్ చేస్తామన్నారు.. చేశారా.. ఇంటింటికి ఉద్యోగం.. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చారా అని అడుగుతున్నా.. అర్హులకు మూడు సెంట్ల స్థలం.. కట్టుకునేందుకు పక్కా ఇళ్లు కట్టించారా.. పది వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నారు.. చేశారా?” అని సీఎం జగన్ ప్రశ్నించారు.